వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రామసముద్రం మండలం చెంబకూరులో జరిగింది. చెంబకూరుకు చెందిన కుమార్ భార్య రోజా(35) ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. అపస్మారస్థితిలో పడి ఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అవమానభారంతో ఆత్మహత్య
పెనగలూరు : మండలంలోని చక్రంపేట గ్రామానికి చెందిన కల్లూరి గంగిరెడ్డి (67) అనే వ్యక్తి తనకు జరిగిన అవమాన భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ కె. రఘురాం సమాచారం మేరకు.. చక్రంపేటకు చెందిన గంగిరెడ్డి అదే గ్రామానికి చెందిన కంచర్ల ఈశ్వర్ రెడ్డికి కొంత నగదును అప్పుగా ఇచ్చాడు. గంగిరెడ్డి అందరి ఎదుట ఈశ్వర్ రెడ్డిని అప్పు కట్టాలని గట్టిగా అడిగాడు. దీంతో అందరి ముందు అప్పు అడుగుతావా అంటూ సోమవారం గంగిరెడ్డి ఇంటివద్దకు కంచర్ల ఈశ్వర్ రెడ్డి, కంచర్ల లక్ష్మీరెడ్డి, కంచర్ల గంగిరెడ్డిలు వెళ్లి కాళ్లతో, చేతులతో కొట్టారు. దీంతో అవమాన భారం తట్టుకోలేక గంగిరెడ్డి నిమ్మతోట వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గణేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి గాయాలు
సిద్దవటం : మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారి ఉప్పరపల్లి గ్రామం సాయిబాబా గుడి సమీప ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. కడప వైపు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ లారీకి అడ్డంగా బర్రె రావడంతో అదుపు తప్పి కడప వైపు నుంచి ద్విచక్రవాహనంలో నందలూరు గ్రామానికి వెళ్తున్న శంకరయ్యను ఢీకొంది. ద్విచక్రవాహనదారుడు లారీ కిందపడటంతో కాలికి బలమైన గాయాలయ్యాయి. గాయపడిన శంకరయ్య నందలూరు ఎస్సీ కాలనీ వాసిగా గుర్తించారు. బాధితుడిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ప్రమాదవశాత్తు కంటికి గాయం
మదనపల్లె రూరల్ : గోడకు మేకు కొడుతుండగా ప్రమాదవశాత్తు మేకు కంటికి తగడంతో కన్నుదెబ్బతిన్న సంఘటన మదనపల్లె పట్టణం బుగ్గకాల్వలో మంగళవారం జరిగింది. బుగ్గకాల్వకు చెందిన సూరి(35) లారీ టింకరంగ్ పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇంటిలో గోడకు మేకును సుత్తితో కొడుతుండగా జారిపోవడంతో కంటిపై మేకు గుచ్చుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి గమనించిన డాక్టర్లు కంటిలో గుచ్చుకున్న మేకును తొలగించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
– ఆవేదనతో పురుగుల మందు తాగిన
బాధితురాలు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ నరసన్నపల్లెలో సంగాని రత్నాలు అనే మహిళకు చెందిన పచ్చని పైరుపై అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వీరారెడ్డి తండ్రి నాగిరెడ్డి మంగళవారం గడ్డి మందు పిచికారీ చేశాడు. దీంతో మొక్క జొన్న, చీనీ చెట్లు మాడి పోయాయని బాధితురాలి కుమారుడు తెలిపాడు. అతని కథనం మేరకు.. నరసన్నపల్లె పొలం సర్వే నంబర్ 268–2లో 1.56 ఎకరాలలో మొక్కజొన్న, నిమ్మ సాగులో ఉందన్నారు. నాగిరెడ్డికి, తమకు భూ సమస్య ఉండంతో ప్రస్తుతం బద్వేలు కోర్టులో కేసు నడుస్తోందన్నారు. కుమారుడు పోలీస్ అనే భావనతో నాగిరెడ్డి తమపై కక్ష సాధిస్తున్నాడని చెప్పాడు. భూ సమస్య కోర్టులో ఉండగానే తమపై దాడులు చేస్తున్నారని వాపోయాడు. తాము అన్ని రకాలుగా నష్టపోవాలనే ఉద్దేశంతో పచ్చని పైరుపై గడ్డి మందు పిచికారీ చేయడంతో పంట నిలువునా వాడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
ఆవేదనతో పురుగుల మందు తాగిన రత్నాలు..
ఉన్న కొద్దిపాటి పైరు నిలువునా మాడిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన భూ యజమాని సంగాని రత్నాలు పంట చేలోనే పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కొండాపురం : తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. అచ్చమ్మ అనే మహిళ ఇంట్లో బీరువాలోని రూ.40 వేలు నగదు, రూ.12 వేలు విలువ చేసే బంగారు ఉంగరాన్ని దొంగిలించారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం


