సోమశిల ముంపు బాధితులకు ఎక్స్‌గ్రేషియా
నందలూరు : సోమశిల ప్రాజెక్టు కింద ముంపునకు గురైన 54 గ్రామాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాల కింద ఎక్స్‌గ్రేషియా పంపిణీకి చర్యలు ప్రారంభించినట్లు తహసీల్దార్ అమరేశ్వరి తెలిపారు. ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన డబ్ల్యుపీ నెంబర్ 119/2022లో వచ్చిన ఆదేశాల మేరకు ముంపు గ్రామాల అవార్డుదారులను గుర్తించి, రికార్డుల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులతో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. పొత్తపి, కొమ్మూరు, కోనాపురం, తిమ్మరాజుపల్లి, కిచ్చంపేట, తాళ్లవరం, చాపలవారిపల్లి, కొత్తపల్లి, రామాంబపురం, రంగాయపేట, వెంకట రాజంపేట, మజార కోనాపురం, ఎగువ రాచపల్లి తదితర ముంపు గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన అవార్డుదారులు ఆధార్‌కార్డు నకలు, అవార్డు కాపీ నకలు, బ్యాంకు పాసుపుస్తకం నకలు, రేషన్‌కార్డు వంటి పత్రాలతో ఆయా గ్రామ సచివాలయాల్లో లేదా నందలూరు మండల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.17, 18వ తేదీలలో చాపలవారిపల్లి, కొత్తపల్లి, వెంకట రాజంపేట, మధిర తిమ్మరాజుపల్లి, రామాంజనేయపురం, జంగాలపల్లి, రంగాయపల్లి, మధిర కోనాపురం, ఎగువ రాచపల్లి తదితర గ్రామాల అవార్డుదారుల నందలూరు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు.
రాయచోటి సబ్ జైలును
తనిఖీ చేసిన న్యాయమూర్తి
రాయచోటి టౌన్ : రాయచోటి సబ్ జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌జైలులోని రికార్డులను పరిశీలించారు. అనంతరం జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడుతూ ఖైదీలు తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖైదీల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాజుపాళెం : తనకు ఇష్టం లేని పెళ్లి వద్దని అటు తల్లిదండ్రులకు, ఇటు బంధువులకు, స్నేహితులకు చెప్పుకోలేక షేక్ పెద్ద మీరావలీ (24) అనే యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామ పొలాల్లో జరిగింది. రాజుపాళెం ఎస్‌ఐ కత్తి వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన షేక్ చిన్న మీరావలీ కుమారుడు పెద్ద మీరావలీకి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మంగళవారం ప్రొద్దుటూరులో బ్యాంకులో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెద్ద మీరావలీ వెల్లాల గ్రామ పొలాల్లో మామిడి జ్యూస్‌లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రాజుపాళెం ఎస్‌ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే పెద్ద మీరావలీ మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి చిన్న మీరావలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సోమశిల ముంపు బాధితులకు ఎక్స్‌గ్రేషియా


