ఉపాధ్యాయుని ఇంటిలో భారీ చోరీ
● దొంగతనానికి పాల్పడిన
ఐదుగురు దొంగలు
● సీసీ కెమెరాలో గుర్తించిన పోలీసులు
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఊటుకూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఉపాధ్యాయుడు శ్రీనివాసులు ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఈమేరకు బాధితుడు మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. తొలుత దొంగలు సుధాకర్ రాయల్ ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడ అలికిడి రావడంతో దొంగతనం చేయలేక వెనుదిరిగారు. అనంతరం పుల్లంపేట మండలం పీవీజీ హైస్కూల్ ఉపాధ్యాయుడు లక్కాకుల శ్రీనివాసులు ఇంటిని లక్ష్యం చేసుకున్నారు. ఉపాధ్యాయుడు, ఆయన భార్య ఉమాదేవి తిరుమల దర్శనానికి వెళ్లారు. అలాగే తన తల్లి పనిమీద రాయచోటికి వెళ్లి ఉండటంతో ఇంటిలో ఎవరూ లేరు. రాత్రి 2 గంటల సమయంలో ఐదుగురు దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. మన్నూరు సీఐ ప్రసాద్‌బాబు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. క్లూస్‌టీంకు సమాచారం అందించారు. కాగా దొంగలు తిరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన చింతమాను వెంకటసుబ్బమ్మ అనే మహిళ వారిని గమనించి, గద్దించి వెంటనే ఇంటిలోకి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో 20 తులాల బంగారు నగలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. మన్నూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.


