పట్టపగలే రెండిళ్లలో చోరీ
గుర్రంకొండ : పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగిన సంఘటన మండలంలోని తలారివాండ్లపల్లె, అరిగిలవారిపల్లెలో జరిగింది. తలారివాండ్లపల్లెకు చెందిన మల్‌రెడ్డి వ్యవసాయ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి తాళాలు వేసుకొని కుటుంబ సభ్యులతో కలసి పొలం వద్దకు వెళ్లారు. పొలం పనులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి రాగానే అప్పటికే ఇంటి తాళాలు తెరచి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాను పగులగొట్టి తెరిచి ఉంచిన దృశ్యాలు కనిపించాయి. పరిశీలించగా బీరువా లాకర్‌లో ఉంచిన 40 గ్రాముల బంగారు నగలతో పాటు రూ. 10 వేలు నగదు చోరికి గురైనట్లు గుర్తించారు. చోరీకి గురైన వస్తువుల విలువ రూ. 4.50 లక్షల వరకు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. మండలంలోని అరిగెలవారిపల్లెకు చెందిన శ్రీరాములు వ్యవసాయకూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంటికి తాళాలు వేసుకొని వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వెళ్లాడు. పనులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఉన్న బీరువా తలుపులు, అందులో లాకర్ తలుపులు పగులగొట్టిన దృశ్యాలు కనిపించాయి. అయితే వస్తువులు చోరీకి గురైన ఆనవాళ్లు కనిపించలేదని బాధితులు పేర్కొన్నారు. చోరీ చేసే సమయంలో ఏదైనా అలికిడి జరగడంతో భయంతో దొంగలు పరారై ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


