వాహనం ఢీకొని యువకుడి మృతి
పుల్లంపేట : మండల పరిధిలోని రెడ్డిపల్లె వద్ద టాటా ఇంట్రా వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వేకోడూరు నుంచి పుల్లంపేటకు ఏపీ 39 ఆర్‌జి 4967 నంబరు గల బుల్లెట్ వాహనంలో దూరి.కార్తీక్ (26) అనే యువకుడు పుల్లంపేట వైపు వస్తుండగా రెడ్డిపల్లె వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఏపీ 39 డబ్ల్యుజే 1964 నంబరు గల టాటా ఇంట్రా గూడ్స్ వాహనం ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్ స్వగ్రామం మండల పరిధిలోని రామసముద్రం గొల్లపల్లె కాగా 4 నెలల క్రితం కువైట్ నుంచి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. కార్తీక్ తండ్రి కొద్దికాలం క్రితం డెంగీ జ్వరంతో మరణించాడు. కార్తీక్ అవివాహితుడు కాగా ముగ్గురు చెల్లెళ్లకు వివాహాలు చేశాడు. యువకుడి మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్న రెడ్డప్ప తెలిపారు.
ట్రాక్టర్ కింద పడి విద్యార్థి..
తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెద్దమండ్యం మండలం ముసలికుంట పంచాయతీ బాలచెరువుపల్లెకు చెందిన ఎం.సహదేవ కుమారుడు రాము (15) తంబళ్లపల్లె మండలం బోయపల్లెలోని మేనేత్త ఇంటిలో ఉంటూ తంబళ్లపల్లెలో ఐటీఐలో చదువుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం బోయపల్లె వద్ద నుంచి ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో గోళ్లపల్లికి సమీపంలో ముందు వరిగడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదశాత్తు కిందపడ్డాడు. అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్.ఐ ఉమామహేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరిలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వాహనం ఢీకొని యువకుడి మృతి


