షేర్ ఆటోను ఢీకొన్న లారీ
గాలివీడు : మండలంలోని ప్యారంపల్లి గ్రామ పరిధిలో గాలివీడు–కోనంపేట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఆవుల శారదమ్మ (45) అనే మహిళ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. సోమవారం ఉదయం 5.40 గంటల సమయంలో ప్యారంపల్లి మిట్ట వద్ద పరదేశిరెడ్డి మామిడి తోట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోపనపల్లె గ్రామం, గొల్లపల్లెకు చెందిన ఆవుల శంకర్ రెడ్డి భార్య శారదమ్మ పొలాల్లో కూలి పనుల కోసం పెద్దమండ్యం మండలం కొత్తల గ్రామానికి వెళ్లేందుకు షేర్ ఆటోలో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో శివపురం వడ్డెపల్లె వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ లారీని ఆర్. శివకుమార్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో షేర్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో శారదమ్మ తలకు తీవ్ర రక్తస్రావ గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.ఆటోలో ప్రయాణిస్తున్న గాలివీటి భాగ్యమ్మ, మల్లేశ్వరి, రాజేశ్వరి తదితరులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి భర్త ఆవుల శంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నేత ఆవుల నాగభూషణ్‌రెడ్డి, సర్పంచ్ చెన్నకేశవరెడ్డిలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించారు.
మహిళ మృతి


