అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు వెలకట్టలేనివి
రాయచోటి : అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం అమరజీవి ఆత్మార్పణ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, రెవెన్యూ అధికారి మధుసూదన్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అమరజీవి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్య వంతులను చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిందన్నారు. ఆయన ప్రాణత్యాగం ఫలితంగా తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం లభించిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు అసమాన త్యాగం, అహింసా మార్గంలో ఆయన చేసిన పోరాటం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఘట్టమని ఈ సందర్బంగా గుర్తు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గొప్ప త్యాగమూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం పోరాటం చేసిన ఆద్యుడని కొనియాడారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


