మొదలు పెట్టారు.. అంతలోనే ఆపేశారు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆవరణలో గురువారం నిత్యాన్నదాన కేంద్రం తాత్కాలిక పనులు మొదలు పెట్టారు. ఎట్టకేలకు నిత్యాన్నదాన కేంద్రం పనులు ప్రారంభమయ్యాయనుకుంటే అంతలోనే ఆ పనులు ఆపేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టీటీడీ సివిల్ విభాగం వారు నిత్యాన్నదాన కేంద్రానికి వేసిన జర్మన్ షెడ్డు 1500/1బి సర్వే నెంబర్‌లోని 19.5 సెంట్లలో వేశారు. అయితే ఆ షెడ్డు వేసిన స్థలం పామూరు వెంకటస్వామిశెట్టి(నాగిశెట్టి) పేరుతో ఉంది. 2013లో టీటీడీ ఆలయ ప్రాంగణంలోని ప్రజల స్థలాలు తీసుకునే సమయంలో పామూరు వెంకటస్వామిశెట్టి అనే వ్యక్తి స్థలంలో ఉన్న కట్టడాలను నష్ట పరిహారం అందించకుండా పడగొట్టి స్వాధీనం చేసుకున్నారని స్థలం యజమానులు చెబుతున్నారు. అనేక సార్లు రెవెన్యూ అధికారులను, టీటీడీ ఉన్నతాధికారులను కూడా ఈ విషయంపై కలిశామంటున్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లామని గుర్తు చేస్తున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా తమ స్థలంలో ఎలా నిత్యాన్నదాన కేంద్రానికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారని ఆ స్థలానికి చెందిన పామూరు వెంకటస్వామిశెట్టి మనువడు పామూరు వెంకట సుబ్రమణ్యం శుక్రవారం అక్కడ జరుగుతున్న పనులను ఆడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమి లేక పనులను టీటీడీ సివిల్ విభాగం వారు తాత్కాలికంగా ఆపేశారు. దీనిపై టీటీడీ ఒంటిమిట్ట సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డిని వివరణ కోరగా ఆ స్థలానికి సంబంధించి సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.


