సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిభ్రమించింది.. పిచ్చాసుపత్రికి తరలించాలని ఎద్దేవా చేశారు. దాడులు, దౌర్జన్యాలు చేయడమే లక్ష్యంగా ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాము ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ మండిపడ్డారు.
తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు తగ్గించుకుంటే మంచిది. దాడులు, దౌర్జన్యాలు చేయడమే లక్ష్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నాకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్యలను వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్నదే మా ఉద్దేశం. మేము ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నాతో సహా తాడిపత్రి వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు
టీడీపీ నేతలు దాడి చేస్తే.. వైఎస్సార్‌సీపీ నేతలపై కౌంటర్ కేసులు దుర్మార్గం. తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ ఉన్నా లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు వస్తోంది?. జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిని టీడీపీ ప్రజాప్రతినిధులే వ్యతిరేకిస్తున్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారాలు చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ట్రావెల్స్ బస్సులకు నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినందుకే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ప్రభాకర్ రెడ్డికి పోలీసులంటే గౌరవం లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి హబ్‌గా తాడిపత్రి మారిపోయింది.
టీడీపీ నేతల అసాంఘిక కార్యకలాపాలకు తాడిపత్రి పోలీసులు సహకరించటం దుర్మార్గం. ప్రభాకర్ రెడ్డికి మతిభ్రమించింది. 24 మంది వైఎస్సార్‌సీపీ నేతల అంతు చూస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారు. గొడవలు సృష్టించటమే ప్రభాకర్ రెడ్డి లక్ష్యమా?. తన కొడుకు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని కూడా ఆయన చెడగొడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేయండి.. లేదంటే శాంతియుతంగా పోరాటాలు కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు.


