అనంతపురం: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా, జేసీ అనుచరులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని పార్టీ శ్రేణులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపై జేసీ వర్గీయులు విచ్చలవిడిగా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు కళ్లముందే జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై స్థానికంగా, వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


