‘ఇది ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది’ | YSRCP lashes out at AP government over conspiracies | Sakshi
Sakshi News home page

‘ఇది ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది’

Jun 30 2026 3:02 PM | Updated on Jun 30 2026 6:18 PM

YSRCP lashes out at AP government over conspiracies

విజ‌య‌వాడ‌:  ఏపీ రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు విమ‌ర్శించారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బండి పుణ్య‌శీల‌, కాలే పుల్లారావు త‌దిత‌రులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 

విద్యాధరపురం డిపో కూల్చివేత కేవలం ఒక డిపో కూల్చివేత కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది అని వారు పేర్కొన్నారు. ఈ-బస్సుల పేరుతో  విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఆక్షేపించారు.

ఈ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీక­రించేందుకు విజ‌య‌వాడ న‌గ‌రంలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి...­శిథిలాలను కూడా తొలగించారు. ఈ స్థలాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు సంద‌ర్శించి ప్ర‌భుత్వ తీరును ఖండించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేత‌లు వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, దేవినేని అవినాష్‌, మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వారు ఏమ‌న్నారంటే..

కూట‌మి ప్ర‌భుత్వ విధ్వంస‌క‌ర పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం:  వెలంప‌ల్లి
30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఆర్టీసీ భవిష్యత్తుపై ఉద్యోగులను, ప్రజలను సంప్రదించకుండా విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణం. విద్యాధరపురం డిపో కూల్చివేత కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు నిదర్శనం. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ భూములను బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్నివైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆర్టీసీ ఆస్తులు, భూములు, డిపోలు పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే కొనసాగాలి, ఉద్యోగాలు కూడా ఆర్టీసీ పరిధిలోనే ఉండాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనావైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంది" అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ఖ‌రీదైన ఆర్టీసీ స్థ‌లాల‌పై కూట‌మి నేత‌ల క‌న్ను:  దేవినేని అవినాష్‌,
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీదైన ప్రభుత్వ, ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గతంలో లూలు మాల్ కోసం విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఏలూరు రోడ్డులో ఉన్న ఖ‌రీదైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించే ప్రయత్నాన్నివైఎస్సార్‌సీపీ అడ్డుకుంది. ఇప్పుడు విద్యాధరపురం డిపో స్థ‌లాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోంది. 

ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా బినామీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది. విద్యాధరపురంతో ఆగకుండా రాష్ట్రంలోని మరో 11 డిపోల భూములను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోంది.ప్రజలు ఈ దోపిడీని గమనిస్తున్నారు. తగిన సమయంలో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపట్టి పోరాడతాం" అనివైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం:  మ‌ల్లాది విష్ణు
ఇసుక, మట్టి, కొండల తర్వాత ఇప్పుడు విలువైన ఆర్టీసీ భూములపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియలో భాగంగానే విద్యాధరపురం డిపోను లక్ష్యంగా ఎంచుకున్నారు. వైయస్ జగన్ హయాంలో ఆర్టీసీ బలోపేతానికి రూ.5 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించారు. కానీ నేడు ఆర్టీసీని బలోపేతం చేయాల్సింది పోయి రూ.6 వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను బినామీలకు ధారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ చర్యలనువైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యాధరపురం డిపో స్థలంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం" అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement