
తీవ్రంగా మండిపడిన వైఎస్సార్‌సీపీ
ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కుంభకోణాలు వరుసగా బహిర్గతం
మద్యం మత్తులో శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ అధికారులపై దాడి
అవినీతి తుపానులో చిక్కుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాభద్రత కంటే నేరస్థులకు పెరోల్ ఇప్పించడంపైనే శ్రద్ధ
మహిళలపై ఎమ్మెల్యేల వేధింపులు.. వెకిలి చేష్టలు
ఇలాంటివి చూసే ప్రజలు టీడీపీని నీచ రాజకీయాల పార్టీ అంటున్నారు
‘సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం’ హ్యాష్ ట్యాగ్‌తో ‘ఎక్స్’లో పోస్ట్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడిన కుంభకోణాలు వరుసగా బయట పడుతుండటంతో టీడీపీ కుప్పకూలిపోతోందని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఇది ప్రభుత్వ విశ్వసనీయత, పాలన గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని స్పష్టం చేసింది. నీచపు రాజకీయాలకు టీడీపీ కేరాఫ్‌గా మారిందని నిప్పులు చెరిగింది.
ప్రభుత్వ అధికారులపై నిస్సిగ్గుగా దాడులు మొదలు.. అవినీతి, పెరోల్ కుంభకోణాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వరకు అనేక వివాదాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూరుకుపోవడంతో అధికార పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టిందని ఎత్తిచూపింది. ఈ మేరకు ‘సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం’ హ్యాష్ ట్యాగ్‌తో జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ బుధవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ పోస్టులో వైఎస్సార్‌సీపీ
ఇంకా ఏమన్నదంటే..
» శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేశారు. పెట్రోలింగ్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ దిగ్భ్రాంతికర సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది అధికార పార్టీ శాసనసభ్యులలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎత్తిచూపింది.
» ఈ వివాదానికి తోడు మంత్రి అచ్చెన్నాయుడు అవినీతిపై తుపానులో చిక్కుకున్నారు. డీలర్లతో అక్రమ కమిషన్ లావాదేవీలలో మధ్యవర్తిగా వ్యవహరించడానికి నిరాకరించినందుకు మాత్రమే తనను అకస్మాత్తుగా బదిలీ చేశారని ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ నేరుగా ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలు ఈ ప్రభుత్వ సమగ్రత, పాలనపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తాయి.
» వివాదాస్పద పెరోల్ సిఫార్సుల చుట్టూ ఉన్న విషయాలు కూడా అంతే ఆందోళనకరంగా ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఒక ప్రసిద్ధ రౌడీ–షీటర్‌కు పెరోల్‌ను సిఫార్సు చేశారు. ఈ చర్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హోం మంత్రి అనిత ఈ ఫైల్‌ను ఆమోదించడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఇటువంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించారు. ప్రజాభద్రత కంటే నేరస్థులకు పెరోల్ ఇచ్చేందుకు అధికంగా శ్రద్ధ చూపడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
» మంత్రులు, ఎమ్మెల్యేల వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస కుంభకోణాలతో టీడీపీ పూర్తిగా కుప్పకూలింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఒక మహిళ పట్ల అసభ్యకరమైన సైగలు చేస్తూ వీడియోలో దొరికిపోయాడు. ఇది వైరల్ అయ్యింది. అసెంబ్లీని ఇబ్బంది పెట్టింది. ఈ సంఘటనను బహిర్గతం చేసినట్లు అనుమానించి, మరొక మహిళను కూడా ఆ ఎమ్మెల్యే వేధించి, ఆమెను ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.

» అమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను పదే పదే వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమెను పని సాకుతో తన కార్యాలయంలో ఉండమని బలవంతం చేస్తున్నాడు. అర్ధరాత్రి అనుచిత వీడియో కాల్స్ చేస్తున్నాడు. భరించలేని విధంగా అవమానాలకు గురిచేస్తున్నాడు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక సౌమ్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇది ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అధికార దుర్వినియోగానికి ప్రతిబింబం.
» మొత్తం మీద ఈ సంఘటనలు టీడీపీలోని మరో కోణాన్ని బహిర్గతం చేశాయి. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అధికార దుర్వినియోగం నుంచి అధికారులపై ప్రత్యక్ష దాడులు, మహిళలపై అసభ్యకరమైన చర్యల వరకు నేరాలకు పాల్పడ్డారు. ఈ ఉదంతాలన్నీ నీచ శ్రేణి రాజకీయాలు చేసే పార్టీగా ప్రజలు టీడీపీని అభివర్ణిస్తున్నారనేందుకు అద్దం పడుతున్నాయని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జవాబుదారీతనం లేకుండా అధికార దుర్వినియోగంతో మహిళల గౌరవం, అధికారుల హక్కులు, ప్రజా విశ్వాసానికి విఘాతం కల్పిస్తున్నారు.