
మానసిక అనారోగ్య పింఛను దారులపై సర్కారు వెనకడుగు
జిల్లాల వారీగా వీరి జాబితాలు పంపుతామన్న ‘సెర్ప్’
సాక్షి’ ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: అనర్హులంటూ రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగ పింఛనుదారులకు కొద్దిరోజులుగా జారీచేస్తున్న నోటీసులను కొందరికి నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పింఛను కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఈ మేరకు సూచించారంటూ సెర్ప్ అధికారులు అన్ని జిల్లాల అధికారులకు బుధవారం సమాచారం ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన జాబితాలను జిల్లాల వారీగా సెర్ప్ కార్యాలయం అందజేస్తుందని వారు తెలిపారు. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు దివ్యాంగులను ప్రధానంగా టార్గెట్ చేసింది. వీరి సంఖ్యను భారీగా కుదించేందుకు 10–15 ఏళ్లకు పైగా పింఛను పొందుతున్న లబ్ధిదారులకు కొత్తగా మళ్లీ వైద్య పరీక్షలు అంటూ హడావుడి చేస్తోంది. మీకు 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉంది, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు నోటీసులు జారీచేస్తోంది.
ఇప్పటికే నాలుగున్నర లక్షల పింఛన్లకు కోత..
గత ప్రభుత్వ హయాంలో 66.34 లక్షల మందికి పైగా పింఛన్లు అందించగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ఆగస్టులో పంపిణీ చేసిన మొత్తం పింఛన్లు 62.19 లక్షలే. ఇప్పుడు దీనికి అదనంగా లక్షలాది మంది దివ్యాంగ, వైద్య పింఛనుదారులకు అనర్హత పేరుతో నోటీసులు జారీచేస్తుండడంపై ‘సాక్షి’ బుధవారం ‘పింఛన్లు.. కకావికలం’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్లలోపు పిల్లలకు జారీచేసే నోటీసులను నిలుపుదల చేయాలంటూ సెర్ప్ సీఈఓ ఆదేశాలు జారీచేశారు.