
తాడేపల్లి : రౌడీ షీటర్ శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ నేతలేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కారయదర్శి జూపూడి ప్రభాకర్ విమర్శించారు. అతన్ని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చింది కూడా ఆ పార్టీ వారేనన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 19) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి..‘ రౌడీషీటర్ శ్రీకాంత్ కు జూనియర్ నయీంగా పేరుంది. టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదరకనే శ్రీకాంత్ వీడియోలు బయటకు వచ్చాయి. సుగాలి ప్రీతి కేసు తేల్చుతామన్న పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని మోసం చేశారు. ప్రీతి తల్లి ఆందోళనకు దిగితే పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఇదేనా బాధిత మహిళల కుటుంబానికి మీరు చేసే న్యాయం?, ప్రభుత్వ అధోగతి పనులపై ప్రజా ఉద్యమానికి రెడీ అవుతున్నాం. ఎమ్మెల్యేలు చేస్తున్న అఘాయిత్యాలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు?, ఎన్నాళ్లు ఇలా డైవర్షన్ రాజకీయలు చేస్తారు?, ఈనాడు పత్రిక తప్పుడు వార్తలు రాసే ముందు తమ చరిత్ర ఎలాంటిదో తెలుసుకోండి. ఆ పత్రిక రాసే కథనాలు చూసి జనం నవ్వుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.