రౌడీషీటర్‌ పెరోల్ ఎపిసోడ్‌.. హోంమంత్రి అనిత తడబాటు | Minister Vangalapudi Anitha Fumbles In Rowdy Sheeter Parole Episode | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌ పెరోల్ ఎపిసోడ్‌.. హోంమంత్రి అనిత తడబాటు

Aug 19 2025 4:43 PM | Updated on Aug 19 2025 5:04 PM

Minister Vangalapudi Anitha Fumbles In Rowdy Sheeter Parole Episode

సాక్షి, విజయవాడ: రౌడీషీటర్‌ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి వంగలపూడి అనిత తడబడ్డారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పని హోం మంత్రి అనిత.. విచారణ జరుగుతుందంటూ సమాచారం దాట వేశారు. సంతకాలు ఎవరెవరు చేశారో చెప్పని హోంమంత్రి.. సిఫార్సు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్లు నమిలారు.

పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అంటూ వింత వాదన వినిపించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణపై విచారణ జరుపుతామంటూ ప్రకటించిన హోంమంత్రి.. మీడియా ఆ విషయం వదిలెయ్యాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు సార్లు శ్రీకాంత్‌కు చంద్రబాబు సర్కార్‌.. పెరోల్ ఇచ్చింది. టీడీపీ నేతల అండతోనే  రౌడీ షీటర్ శ్రీకాంత్ బయటకొచ్చారు. పెరోల్‌లో మీ పాత్ర ఏంటంటూ హోంమంత్రి అనితను మీడియా ప్రశ్నించగా.. తన పాత్ర ఉందొ లేదో చెప్పకుండా.. పెరోల్ వెనుక ఉన్న వారిపై పోస్ట్‌మార్టం చేయండి అంటూ మాట దాటవేశారు.

కాగా, హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌ పెరోల్‌ వెనుక హోంశాఖ హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరోల్‌పై విడుదలైన శ్రీకాంత్‌ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగిన విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఆగమేఘాలపై పెరోల్‌ రద్దు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కలిసి చేసిందంతా చేసి ఎల్లో మీడియా ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా వైఎస్సార్‌సీపీకి అంటగట్టే యత్నం చేస్తుండడం అందరినీ విస్మయపరుస్తోంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్‌ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. శ్రీకాంత్‌ ఓ హత్య కేసులో 2010 నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో ఆయన సెమీ ఓపెన్‌ జైల్లో పని చేస్తూ తప్పించుకుని పరారయ్యాడు. నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి పోలీసులకు లొంగిపోయాడు.  టీడీపీ నేతల అండదండలు ఉండడంతో  శ్రీకాంత్‌ నాలుగున్నరేళ్లు ఎక్కడున్నాడు? ఏం చేశాడనే విషయం ఎవరికీ తెలియదు.

జైలులో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవా­డని, వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్‌మెంట్లు చేయించేవాడన్న ప్రచారం కూడా ఉంది. జైల్లో ఉన్న ఖైదీలతో కలిసి జైలు సిబ్బందిపై తిరగబడిన ఘటనలు లేకపోలేదు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా జైలు అధికారులను బెదిరించేవాడని తెలిసింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చి అనారోగ్యం పేరుతో ఆస్ప­త్రుల్లో రోజుల తరబడి గడిపేవాడు. ఆ ఆస్పత్రుల్లో తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడి­యోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవు­తు­న్నాయి.  జైలు నుంచే బయట వ్యక్తులను శాసించే స్థాయికి  ఎదిగాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు అతన్ని నిలు­వరించే సాహసం చేయలే­క­పో­యారు.

ఇంత అధికార బలం ఉండడం వల్లే టీడీపీ­కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సహ­కా­రంతో పెరోల్‌కు దరఖాస్తు చేసుకు­న్నారు. అయితే పెరోల్‌ ఇవ్వొద్దని, అతను బయటకొస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని  తిరుపతి జిల్లా ఎస్పీ­తోపాటు, గూడూరు డీఎస్పీ, సీఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినా, అనూహ్యంగా గత నెల 30న శ్రీకాంత్‌కు పెరోల్‌ మంజూరు చేస్తూ జీఓ విడుదలైంది. ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత కనుస న్నల్లోనే 30 రోజుల పెరోల్‌ మంజూరైనట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో శ్రీకాంత్‌ బయ­టకు వచ్చేశాడు. హోంమంత్రి అనిత సంతకం ఆధారంగానే శ్రీకాంత్‌ పెరోల్‌పై వచ్చినట్లు అతని సన్నిహితురాలు అరుణ స్పష్టం చేయడం గమనార్హం. బయటకు వచ్చిన శ్రీకాంత్‌ జల్సాలు చేయడం, బెదిరింపులకు దిగటం వంటి అంశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. హడావుడిగా పెరోల్‌ని రద్దు చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement