వాలీబాల్ విజేత ఏపీఎస్పీ బెటాలియన్
ఇబ్రహీంపట్నం: రావి ఫణి యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలు శనివారం రాత్రి హోరాహోరీగా జరిగాయి. వెల్లటూరు, శక్తినగర్, ఏపీఎస్పీ బెటాలియన్, తదితర జట్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ వెల్లటూరు, ఏపీఎస్పీ జట్లు మధ్య జరగగా, ఏపీఎస్పీ బెటాలియన్ జట్టు విజేతగా నిలిచింది. విజేతకు మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, గణేష్ ట్రాన్స్‌పోర్ట్ అధినేత రాం ప్రసాద్ బహుమతులు అందజేశారు. 13న పొట్టేళ్ల పోటీలు జరగనున్నట్లు నిర్వాహకుడు రావి ఫణి తెలిపారు.
నేటి నుంచి పొట్టేళ్ల పందేలు
కూచిపూడి(మొవ్వ): సంక్రాతి సంబరాల్లో భాగంగా మొవ్వ మండలం కూచిపూడిలోని నన్నపనేని గ్రౌండ్స్‌లో నన్నపనేని యువసేన ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పొట్టేళ్ల పందేలను సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైయ్యే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాంపూర్, కర్ణాటక, వినైతి జాతులకు చెందిన పెందెం పొట్టేలు సుమారు 250 వరకు ఇక్కడికి తీసుకొచ్చారు. వీటిని చూసేందుకు స్థానిక ప్రజలు, పిల్లలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు యజమానులు తమ పొట్టేళ్లతో తరలి వచ్చారు. ఈ పోటీలను రాంపూర్ జాతి, కర్ణాటక జాతుల ప్రకారం రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు నన్నపనేని వీరేంద్ర తెలిపారు.
దుర్గమ్మ సన్నిధిలో రద్దీ సాధారణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి ఆదిదంపతులైన దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు ఉదయం 11.40 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మహానివేదన అనంతరం తిరిగి 12.20 గంటలకు దర్శనాలు ప్రారంభం కాగా ఘాట్ రోడ్డుపై నుంచి వచ్చే క్యూలైన్లు గాలిగోపురం వరకు, మహామండపం వైపు నుంచి వచ్చే భక్తుల క్యూ మైక్ ప్రచార కేంద్రం వరకు మాత్ర మే చేరింది. రద్దీ సాధారణంగా ఉన్నా దేవస్థానం రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, అంతరాలయం రద్దు చేసింది. రూ. 300 టికెట్లపై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అంతరాలయ దర్శనం ప్రారంభమైంది. సాయంత్రం వరకు రద్దీ సాధారణంగానే కొనసాగింది.
రెవెన్యూ కార్యాలయంలో విచారణ
కంచికచర్ల: కంచికచర్ల రెవెన్యూ కార్యాలయంలో ఈనెల 9తేదీ తెల్లవారుజామున రెవెన్యూ రికార్డులు అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఘటనపై చీఫ్ కమిషనర్ ల్యాండ్ ఎక్విజేషన్(సీసీ ఎల్‌ఏ) జయలక్ష్మి ఆదివారం విచారణ చేపట్టారు. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో దగ్ధమైన రికార్డు గదిని జేసీతో కలసి పరిశీలించారు. రికార్డులు దగ్ధమవటానికి కారణాలు రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ వల్ల కాలిపోయాయా లేదా ఆకతాయిల వల్ల ఏమైనా జరిగిందా అని పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఆమె చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ, తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు నందిగామ రూరల్ సీఐ చవాన్ తదితరులున్నారు.
వాలీబాల్ విజేత ఏపీఎస్పీ బెటాలియన్
వాలీబాల్ విజేత ఏపీఎస్పీ బెటాలియన్
వాలీబాల్ విజేత ఏపీఎస్పీ బెటాలియన్


