కనిపించని క్షీరధార!
దసరా ఉత్సవాల సమయంలో తరలింపు
అప్పటి నుంచీ అభిషేకాలకు ప్యాకెట్ పాలే దిక్కు
గోసంరక్షణకు భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నా అభివృద్ధి శూన్యం
కొనసాగుతున్న కమిటీ విచారణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేవలం గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. అంతటి విశేషమైన గోమాతను సాక్షాత్తూ అమ్మలగన్నమ్మ దుర్గమ్మ సన్నిధికి దూరం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఉండాల్సిన గోవులను ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరంకిలోకి వేద పాఠశాలకు తరలించారు. దీంతో అమ్మవారి, అయ్యవారి పూజలు, అభిషేకాలను అవసరమైన ఆవు పాల కోసం ప్యాకెట్ పాలు, టెట్రా ప్యాకెట్ పాలపై ఆధారపడాల్సి వచ్చింది.
తొలి దర్శనం గోమాతే..
ఆలయ ప్రాంగణంలో క్యూలైన్ల పక్కన గోశాల ఉండేది. క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు తొలుత గోమాతను దర్శించుకున్న అనంతరం ఎడమ వైపునకు తిరిగితే అమ్మవారి బంగారు గోపురం, కుడివైపునకు తిరిగి చూస్తే రాజగోపురం దర్శనమిస్తుంది. ఇక ఆలయానికి విచ్చేసే పీఠాధిపతులు, స్వామిజీలు సైతం గోమాతను దర్శించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కృష్ణాష్టమి వంటి విశేష పర్వదినాల్లో ఆలయ అధికారులకు గోమాతకు పూజలు నిర్వహించి ఇక లక్ష్మీగణపతి విగ్రహం పక్కనే గోకులం ఏర్పాటు చేసి అందులో గోమాత కోసం గరుకు రాయిని సైతం ఏర్పాటు చేశారు. గోశాల, గోకులంలో నాలుగు గోమాతలను సంరక్షించేందుకు ఇద్దరు సుశిక్షకులైన గోసంరక్షకులు ఉండేవారు. గోమాత బాగోగులు చూసుకోవడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ పాలు పితికి ఆలయంలో అందించేవారు. ఇక అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు తమ శక్తి కొలది విరాళాలను అక్కడే ఉన్న హుండీలో వేసేవారు. ప్రతి నిత్యం అమ్మవారి దర్శనానికి విచ్చేసే అనేక మంది భక్తులు కొండ దిగువ నుంచి మేత తీసుకువచ్చి గోవులకు అందించేవారు.
పునాదులతో పెకిలించి..
ఈ ఏడాది దసరా ఉత్సవాల సమయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలను, గోకులంలో గోమాతలను పోరంకిలోని వేద పాఠశాలకు తరలించారు. అయితే ఉత్సవాల అనంతరం గోమాతలను తిరిగి దుర్గగుడికి తీసుకువస్తారని భక్తులందరూ భావించారు. అయితే ఇంత వరకు అటువంటి చర్యలేమీ తీసుకోకపోగా, ఆలయ ప్రాంగణంలో గోశాలను పునాదులతో పెకిలించారు. పవిత్రమైన గోవులు ఉండే గోశాల స్థలంలో ఇప్పుడు కుక్కలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇక గోకులం శానిటేషన్ సిబ్బందికి ఆవాసంగా మారింది. అక్కడే భోజనాలు చేయడం, విశ్రాంతి తీసుకోవడం తమకు పనికి రాని సామగ్రిని భద్రపరుచుకునే గోడౌన్‌గా మారిపోయింది.
శివార్చనకు ప్యాకెట్ పాలు..
దుర్గగుడి ప్రాంగణంలోని గోశాలలో ఆవుల ద్వారా ప్రతి నిత్యం సుమారు పది లీటర్లకు పైగా పాలు లభించేవి. ఈ పాలను ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి అభిషేకాలకు వినియోగించే వారు. ప్రతి నిత్యం గోవులను సంరక్షించే వ్యక్తి తెల్లవారుజామున నాలుగు గంటలకే పాలు పితికి వాటిని శివాలయంలో అర్చకులకు అందించే వారు. అయితే ఇప్పుడు మల్లేశ్వర స్వామి వారికి గోశాల నుంచి వచ్చే పాలు కాకుండా ప్యాకెట్లు, డబ్బాలలో తెచ్చిన పాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధమైన ఆలయాలు, పుణ్యక్షేత్రాలలో శివార్చనకు ప్యాకెట్ పాలను వినియోగించరు. అయితే ఇంద్రకీలాద్రిపై మాత్రం ప్రతి నిత్యం శివయ్య అభిషేకానికి ప్యాకెట్ పాలను వినియోగించడం ఎంత వరకు సబబో దుర్గగుడి అధికారులే చెప్పాలి.
దుర్గమ్మకు అల్లంత దూరాన గోమాత
దుర్గగుడిలో శ్రీచక్ర పూజలో వినియోగించే పాలలో పురుగు వచ్చిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీచక్రనవార్చన పూజ నిర్వహించే అర్చకుడి విధుల్లో ఆదివారం నుంచి మార్పు చేసినట్లు సమాచారం. అర్చకుడికి లక్ష కుంకుమార్చన పర్యవేక్షణతో పాటు ఆదిదంపతులకు సాయంత్రం సమయంలో జరిగే పల్లకీ సేవ, దర్బారు సేవ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపు ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి నుంచి విచారణ కమిటీ రికార్డు పూర్వకంగా స్టేట్ మెంట్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు అర్చకుడు పూజలో ఉండటంతో ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేనందున వాట్సాప్‌లో సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని కొంత మంది ఆలయ అధికారులు కావాలనే బయటకు సమాచారం ఇచ్చినట్లు ఈఓ గుర్తించి.. సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.


