వడ్డే ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఉద్యమ పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, అధికారులు, వడ్డెర సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు ఓబన్న చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం జనహృదయాలలో నిలిచిందన్నారు. ఓబన్న రైతుల హక్కులను రక్షించడానికి, వారి న్యాయం కోసం పోరాడటానికి విశేష కృషి చేశారన్నారు.
తిరుపతమ్మకు బోనాలు
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని రంగుల మండపంలో వేంచేసియున్న గోపయ్య సమేత శ్రీలక్ష్మీ తిరుపతమ్మవారి ఉత్సవ మూర్తులకు జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ బి.లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. రెండేళ్లకు ఒకసారి పేట పట్టణంలో కొలువుండే తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఆశీస్సులు పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు, పట్టణ ప్రజలకు ఉండాలని కోరుతూ బోనాలు సమర్పించామని డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు, వత్సవాయి ఎస్‌ఐలు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వడ్డే ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకం


