డీఎస్సీలో డొంక తిరుగుడు! | Conspiracy to select candidates without announcing the Mega DSC merit list | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో డొంక తిరుగుడు!

Aug 21 2025 5:54 AM | Updated on Aug 21 2025 5:54 AM

Conspiracy to select candidates without announcing the Mega DSC merit list

మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్ర

ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు నేరుగా మెసేజ్‌ పంపుతామనడంపై అనుమానాలు 

తమకు కావాల్సిన వారికి పోస్టులు ఇచ్చేందుకు అడ్డదారులు  

టెట్‌ మార్కులు సరిగా నమోదు చేయలేదంటూ అభ్యర్థులపై నెపం 

పూర్తి డేటా ఉన్నా సరిచేయకుండానే డీఎస్సీ మార్కుల విడుదల 

తుది కీలో తప్పులు సరిచేయకుండా అభ్యర్థులకు అన్యాయం  

ఇప్పుడు మెరిట్‌లో ఎవరు ఉన్నారో చెప్పకుండానే నియామకాలకు రంగం సిద్ధం  

ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటా తొలగింపుపై న్యాయ పోరాటానికి అభ్యర్థుల సన్నాహాలు.. ముసురుకుంటున్న వివాదాలు 

3.36 లక్షల మంది జీవితాలతో కూటమి సర్కారు చెలగాటం 

ప్రభుత్వ పెద్దల తప్పిదాలకు నిన్న విద్యార్థులు.. నేడు ఉద్యోగార్థులు బలి!  

సాక్షి, అమరావతి :మెగా డీఎస్సీ.. ‘దగా డీఎస్సీ’గా మారనుందా..? ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టారా..? పారదర్శకంగా మెరిట్‌ లిస్ట్‌ వెల్లడించకుండా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్‌ పంపిస్తాం.. మీరే చూసుకోండి అని గుంభనంగా వ్యవ­హరించడం ఏమిటి? అనే అనుమానాలు ఉపాధ్యాయ అభ్యర్థుల్లో రేకెత్తు­తు­న్నాయి. కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకు కావాల్సిన అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు అడ్డదారులు ఎంచుకుందా? అనే సందేహాలు కలు­గుతున్నాయని మండిపడుతున్నారు. గతానికి భిన్నంగా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ వెల్లడించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెస్సే­జ్‌ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం వెనుక పెద్ద కుట్రే దాగుందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో కలుగుతోంది. 

ఏ డీఎస్సీలోనూ లేని రీతిలో..
సాధారణంగా డీఎస్సీ పరీక్షలు జిల్లా స్థాయిలో నిర్వహించి మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్స్‌ ఇవ్వాలి. కానీ 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీంతో అభ్య­ర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకో­ర్టును ఆశ్రయించారు. దాంతో నియామకాలు నిలిచిపోగా తర్వాత అధికా­రంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టింగ్స్‌ ఇచ్చిన విష­యం తెలిసిందే. 

అయితే, 2018 డీఎస్సీ కంటే దారు­ణమైన తప్పులు 2025 డీఎస్సీలో చోటు చేసుకు­న్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. లిస్ట్, సెలక్షన్‌ లిస్ట్‌ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్‌’ అభ్యర్థుల ఫోన్లకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం మెసేజ్‌లు పంపుతా­మని ప్రభుత్వం చెబుతుండటంతో అభ్యర్థులు నివ్వెరపోతున్నారు. 

తప్పులు సరిచేయకుండానే మార్కుల వెల్లడి
3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖా­స్తులు సమర్పించగా ఈ ఏడాది జూన్‌ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడుదలైన ఫైనల్‌ కీ చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించినా, దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని విద్యాశాఖ ప్రకటించడంతో ఫైనల్‌ కీలో తప్పులపై విద్యాభ­వన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫిర్యాదులు చేశారు. ‘సాక్షి’ ఈ విషయాన్ని డీఎస్సీ కన్వీనర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఫైనల్‌ కీలో ఎలాంటి తప్పులు లేవంటూనే నిపుణులతో పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పా­రు. తీరా ఆ తప్పులను సరిచే­యకుండానే అభ్య­ర్థు­ల మార్కులు ప్రకటించారు. 

టెట్‌ మార్కుల నమోదులోనూ నిర్లక్ష్యం 
టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. టెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలో సాధించిన వాటికి అద­నంగా కలవడంతో మెరిట్‌ లిస్ట్‌లో ఉంటారు. ఇప్పటి వరకు జరిగిన టెట్‌ వివరాలు, అభ్యర్థుల డేటా, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో సదరు అభ్యర్థి ఆధార్, ఫోన్‌ నంబర్లతో లింక్‌ అయ్యి ఉంటాయి. ఫోన్‌ నంబర్లు మారినా ఆధార్‌ మారే అవకాశం లేదు. కానీ డీఎస్సీ 2025 నిర్వహణలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

ఎన్నో అనుమానాలు.. !
నార్మలైజేషన్‌ అనంతరం ఆగస్టు 11న ఫలితాలను ప్రకటించగా సవరించిన టెట్‌ మార్కులతో ఈనెల 13న స్కోర్‌ కార్డులను విడుదల చేశారు. టెట్‌ మా­ర్కుల్లో తప్పులు ఉంటే అభ్యర్థులే స్వయంగా సవరించుకోవాలంటూ ఒకరోజు అవకాశం కల్పించారు. అభ్య­ర్థులే టెట్‌ మార్కులు తప్పుగా నమోదు చేశారంటూ పాఠశాల విద్యాశాఖ నెపం వారిపై నెడుతోంది. మరి విద్యాశాఖ వద్ద అభ్యర్థుల ‘టెట్‌’ డేటా ఉంటే అభ్య­ర్థులే సవరించుకోవాలని ఎందుకు చెప్పినట్లు? డీఎస్సీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించే క్రమంలోనే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ వివరాలు నమో­దు చేయగానే టెట్‌ మార్కులు వచ్చేలా ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా­యి.

మెరిట్‌ అభ్యర్థులకు అన్యాయం..!
1990 నుంచి 2019 స్పెషల్‌ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. డీఎస్సీ 2025లో మాత్రం అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను ప్రభుత్వం ప్రకటించకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చా­యి? మెరిట్‌ లిస్ట్‌లో ఏ స్థానంలో ఉన్నామో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. 

ఈ విధా­నం తమకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవు­తు­న్నాయి. ఇప్పటికే డీఎస్సీలో చోటుచేసు­కున్న తప్పులపై కొందరు అభ్యర్థులు న్యాయస్థా­నాన్ని ఆశ్రయించారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా ఎత్తివేయడంపై ఆయా అభ్యర్థులు కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

డీఎస్సీ ఫలితాల్లో గూడుపుఠాణీ!
టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీ ఫలితాల వెల్లడిలో అభ్యర్థులను దగా చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. డీఎస్సీ ఫలితాలు ప్రకటించే సమయంలో మెరిట్‌ లిస్ట్‌లను తొక్కిపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. పారదర్శకతకు పాతర వేస్తూ మెరిట్‌ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టేందుకు మంత్రి నారా లోకేశ్‌ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ఫలితాలు వెలువడే ముందు దాదాపు 60 వేల మందికి టెట్‌ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వడం అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడే ఈ విధానాలకు తక్షణం స్వస్తి పలకాలి అని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement