విరువూరులో పూర్తి సంతకాలతో కాకాణి గోవర్థన్‌రెడ్డి, పార్టీ నేతలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గడువుకు ముందే లక్ష్యసాధన
భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు
హాజరైన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
పొదలకూరు: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం సర్వేపల్లిలో ఆదివారంతో పూర్తయింది. ఈ నియోజకవర్గంలో 60 వేల సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ణయించింది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ లక్ష్యాన్ని ముందుగానే పూర్తిచేయడంతో ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దంపట్టింది.
ఈ నెల 22 నాటికి సంతకాల సేకరణ పూర్తిచేయాల్సి ఉండగా, 16వ తేదీకే కాకాణి పూర్తిచేయించి ముగింపు సభను పొదలకూరు మండలం విరువూరులో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనను ఖండిస్తూ సర్వేపల్లిలో పెద్దఎత్తున నిర్వహించిన ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలను పెట్టారు. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యులయ్యారు. పేదలకు ప్రభుత్వ వైద్యం దూరం అవుతుందని చాటిచెబుతూ కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు ఆయన కుమార్తె, పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత నియోజకవర్గంలో పర్యటించి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.


