సాక్షి, తిరుపతి: తిరుపతిలోని స్విమ్స్‌లో 303 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నియామకాలను "మరో డీఎస్సీ స్కామ్"గా అభివర్ణిస్తూ, మొత్తం ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని మండిపడ్డారు.
భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘స్విమ్స్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే విద్యార్హతల్లో మార్పులు చేశారు. అనుభవ ప్రమాణాలను కొందరికి అనుకూలంగా మార్చారు. నిపుణుల కమిటీ లేకుండానే సిలబస్ రూపొందించారు. ముందే ఎంపిక చేసిన అభ్యర్థుల కోసమే నోటిఫికేషన్ రూపొందించారు. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో కూడా పక్షపాతం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు బంధువు ఆదిశేషయ్య స్విమ్స్‌లో చక్రం తిప్పుతున్నారు. స్విమ్స్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. బర్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియామక కమిటీ ఏర్పాటు చేశారు.
గత డాక్టర్ల నియామకాల్లోనూ భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 100 మంది డాక్టర్ల నియామకాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు 303 పోస్టుల భర్తీపైనా అదే తరహా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు అనుమతి లేకుండానే కొన్ని పోస్టుల వేతనాలు పెంచారు. కొందరికి ఉద్యోగాలు కల్పించేందుకే వేతనాల్లో మార్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ లేదా స్వతంత్ర సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించలేదు. ఎయిమ్స్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిపుణులను పక్కన పెట్టారు.
ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల నిపుణుల సలహా తీసుకోలేదు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూతో ఉద్యోగాలు నిర్ణయించే విధానం తీసుకొచ్చారు. ఇంటర్వ్యూల పేరుతో మెరిట్‌కు తూట్లు పొడిచారు. ఇంజినీరింగ్ నియామకాలలోనూ భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన రోజే ఉద్యోగాలు అమ్ముడయ్యాయనే చర్చ జరుగుతోంది. టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా కొరవడింది. స్విమ్స్ 303 ఉద్యోగాల భర్తీపై విచారణ చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు.


