సి.రామాపురం టీడీపీ నేతపై సిబ్బంది ఆగ్రహం
కొంత సేపు విధులు బహిష్కరించి నిరసన
ఎమ్మెల్యే రాజీ యత్నంతో అసహనంగానే వెనుదిరిగిన ఉద్యోగులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రామచంద్రాపురం తహసీల్దారు కార్యాలయంలో తమ్ముళ్లు హల్‌చల్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్ని రాజకీయ రగడకు వేదికగా మార్చుకున్నారు. భూ సర్వే వ్యవహారంలో మండల సర్వేయర్‌తో పాటు గంగిరెడ్డిపల్లి విలేజ్ సర్వేయర్ తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న అక్కసుతో దూషణలకు దిగుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులన్న గౌరవం కూడా లేకుండా గలీజు మాటలతో మానసికంగా వేదనకు గురిచేశారు.. ఇంత జరుగుతున్నా తహసీల్దారు నుంచి ఉద్యోగులకు అండగా స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన వారంతా కొంత సేపు ‘పెన్‌డౌన్’ చేసి విధులు బహిష్కరించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఉద్యోగులను ఇంటికి పిలిపించుకుని తన అనుచరులచేత క్షమాపణ చెప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు అక్కడి నుంచి అసహనంగానే వెనుదిరిగినట్టు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సర్వేయర్లను లక్ష్యంగా చేసుకుని దూషణలు
వివాదానికి కారణం ఇదీ
రామచంద్రాపురం మండలం, పీవీపురం పంచాయతీ సంజీవరాయపురం గ్రామంలోని సర్వే నం.1లో 119 ఎకరాల డీకేటీ భూములను కొట్టేసి ‘ఫ్రీ హోల్డ్’ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సి.రామాపురానికి చెందిన ఓ టీడీపీ నేత స్కెచ్ వేశాడు. ఆ నాయకునికి స్థానిక ముఖ్యనేత అండగా నిలబడడంతో రైతుల భూములను కారు చౌకగా కొనుగోలు చేసే పనులను ప్రారంభించారు. ఇప్పటికే 25ఎకరాల వరకు కొనుగోలు చేసి జేసీబీలతో చదును చేస్తున్న ఆ టీడీపీ నేత మరో 15 ఎకరాల కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ డీకేటీ భూముల వ్యవమారంలో అనుభవం ఒకరు, ఆన్‌లైన్‌లో మరొకరి పేరు ఉండడంతో వాటిని సరిచేసుకోవడానికి కొందరు రైతులు సర్వే చేయాలని రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేశారు. గంగిరెడ్డిపల్లి విలేజ్ సర్వేయర్, మండల సర్వేయర్ ఆదేశాలతో ఆన్‌లైన్ అడంగళ్ ప్రకారం హక్కుదారులైన రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే కొంత మేరకు డీకేటీ భూములను కొనుగోలు చేసిన ఆ టీడీపీ నేత హక్కుదారునిగా తనకు నోటీసు ఇవ్వకుండా భూమి అమ్మిన రైతు పేరిట నోటీసులు ఎలా ఇస్తారంటూ సదరు సర్వేయర్‌పై మండిపడినట్టు సమాచారం. ఆ తర్వాత బూతు పురాణం అందుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతటితో ఆగక ఏకంగా తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని అక్కడ మరోసారి హల్‌చల్ చేసినట్టు సమాచారం. ఇదంతా బుధవారం జరిగినప్పటికీ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


