వివాహేతర సంబంధం.. ప్రియుడిని రాడ్డుతో కొట్టి దారుణ హత్య! | Crime Incident Involving An Extramarital Affair In Prakasam District | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. ప్రియుడిని రాడ్డుతో కొట్టి దారుణ హత్య!

Jul 17 2026 12:24 PM | Updated on Jul 17 2026 12:43 PM

Crime Incident Involving An Extramarital Affair In Prakasam District

సంతమాగులూరు మండలం పాతమాగులూరులో ఘటన

అద్దంకి పోలీసుల ఎదుట నిందితుడి లొంగుబాటు

ప్రకాశం, సంతమాగులూరు(అద్దంకి): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని మహిళ కుమారుడు రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన సంతమాగులూరు మండలం పాతమాగులూరులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాతమాగులూరుకు చెందిన సజ్జల పిచ్చిరెడ్డి (47) వ్యవసాయం చేస్తుంటాడు.

ఆయనకు భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, పిచ్చిరెడ్డికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ కుమారుడు విష్ణువర్ధన్‌ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి చైన్నె నుంచి వచ్చిన విష్ణు నేరుగా ఇంటికి వెళ్లాడు. అప్పటికే తన ఇంట్లో ఉన్న పిచ్చిరెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విష్ణును గమనించిన పిచ్చిరెడ్డి భయంతో బయటకు పరుగులు తీశాడు. అయితే, అతన్ని వెంబడించిన విష్ణువర్ధన్‌ ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో పిచ్చిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

బుధవారం రాత్రి బయటకు వెళ్తున్నానని చెప్పిన భర్త తిరిగి రాకపోవడంతో.. ఆ మహిళ ఇంటికే వెళ్లి ఉంటాడని భార్య అనూష భావించింది. గురువారం ఉదయం భర్త హత్యకు గురయ్యాడన్న వార్త తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. తన భర్తను సదరు మహిళ కుమారుడే హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతమాగులూరు సీఐ శేషగిరిరావు సమాచారంతో దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు.

లొంగిపోయిన నిందితుడు
హత్యకు పాల్పడిన విష్ణువర్ధన్‌ తన తల్లితో కలిసి వెళ్లి అద్దంకి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. గతంలోనే వీరి సంబంధం గురించి తెలుసుకున్న విష్ణువర్ధన్‌.. తమ ఇంటికి రావొద్దని పిచ్చిరెడ్డిని తీవ్రంగా హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఉలిక్కిపడ్డ మండల వాసులు
ఫ్యాక్షన్‌ ప్రాంతంగా గుర్తింపు ఉన్న పాతమాగులూరులో ఉదయాన్నే హత్య వార్త దావానలంలా వ్యాపించింది. ఏ రాజకీయ హత్య జరిగిందోనని మండల ప్రజలు తొలుత తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, హత్యకు దారితీసిన అసలు కారణం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement