సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర తీసింది. పార్టీ శ్రేణుల నుంచి ఈ యాప్ పట్ల భారీ స్పందన వస్తోంది. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న(జులై 16, గురువారం) సాయంత్రం వైఎస్ జగన్ ఈ యాప్‌ను ప్రారంభించారు. ప్రారంభించిన గంటలోనే 25 వేలకుపైగా డౌన్‌లోడ్‌లు నమోదయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ ఉదయం కల్లా లక్షకు పైగా కార్యకర్తలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని.. కాసేపటికే ఆ వేగం మరింత పెరిగింది.

కార్యకర్త టు అధినేత.. అనుసంధానం
పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య నేరుగా సంబంధాలు కొనసాగించేలా ఈ యాప్‌ను రూపొందించారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు అందరూ ఒకే వేదికపై అనుసంధానమయ్యేలా ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
యాప్ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికల్లో తమ పార్టీకి సంబంధించిన కంటెంట్‌పై జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సొంత డిజిటల్ వేదిక అవసరమైందని తెలిపారు. "ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేందుకు ఈ యాప్ ఒక వేదికగా ఉంటుంది. పార్టీతో ప్రతి ఒక్కరూ నిరంతరం అనుసంధానమై ఉంటారు" అని జగన్ పేర్కొన్నారు.
డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి 👉: జగన్ 2.0 సూపర్ యాప్
నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం
క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించారు. రాజకీయ వేధింపులు, ఇతర సమస్యలపై కార్యకర్తలు వివరాలను నమోదు చేసుకునేలా డిజిటల్ డైరీ సదుపాయాన్ని కూడా అనుసంధానం చేశారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేస్తే.. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ, రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు వాటిపై స్పందించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ కార్యక్రమాలు.. లైవ్ అప్‌డేట్స్
పార్టీ సమావేశాలు, ప్రెస్‌మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు వంటి సమాచారం యాప్‌లోని లైవ్ ఫీడ్ ద్వారా కార్యకర్తలకు అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు. భవిష్యత్తులో యాప్‌ను మరింత అభివృద్ధి చేస్తామని, కార్యకర్తలకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.
డిజిటల్ పోరాటానికి కొత్త వేదిక
ఇతర సోషల్ మీడియా వేదికల్లో పార్టీకి వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా జగన్ 2.0 సూపర్ యాప్‌లో ఉండనుంది. అదే సమయంలో కార్యకర్తలంతా పార్టీ నాయకత్వంతో నిత్యం టచ్‌లో ఉండేందుకు ఈ సూపర్ యాప్ ఉపయోగపడుతుంది.

మొత్తంగా.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను డిజిటల్‌గా ఏకం చేయడం, పార్టీ కార్యక్రమాలను వేగంగా చేరవేయడం, క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకోవడం లక్ష్యంగా తీసుకొచ్చిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’పై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి పెరుగుతోందన్నది లభిస్తున్న స్పందన బట్టి స్పష్టమవుతోంది.


