చనువుగా మాట్లాడతూ.. ఓచర్‌ రాస్తానని నమ్మించి.. | Accused Shaik Nagur Meeravali Criminal Case Prakasam District | Sakshi
Sakshi News home page

చనువుగా మాట్లాడతూ.. ఓచర్‌ రాస్తానని నమ్మించి..

Jul 17 2026 12:50 PM | Updated on Jul 17 2026 1:14 PM

Accused Shaik Nagur Meeravali Criminal Case Prakasam District

బ్యాంకుల వద్ద మహిళలే లక్ష్యంగా మోసాలు

సీసీ పుటేజీలో గుర్తించిన పోలీసులు

నిందితుడిపై 50కి పైగా కేసులు

నిందితుడు షేక్‌ నాగూర్‌ మీరావలీ

తూర్పు గోదావరి, కైకలూరు: బ్యాంకులో అన్నీ తెలిసిన వ్యక్తిగా చలామణి అవుతాడు. అక్కడ వస్తువులు సర్దుతున్నట్టు నటిస్తూ బ్యాంకు సిబ్బందితో చనువుగా మాట్లాడతాడు. చదువురాని డ్వాక్రా మహిళలను టార్గెట్‌ చేస్తూ.. అదును చూసి ఫేక్‌ ఓచర్లు రాసి సొమ్ములు కాజేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్‌ నాగూర్‌ మీరావలి.

ఇదే తరహాలో కృష్ణా, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మీరావలిపై 50కు పైగా కేసులు నమోదయ్యాయి. బ్యాంకుల వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని తాను బ్యాంకు ఉద్యోగి, డ్వాక్రా సీసీనంటూ నమ్మించి నగదు తీసుకుని కౌంటర్‌లో చెల్లిస్తానని నమ్మిస్తున్నాడు. వారికి ఫేక్‌ ఓచర్‌ అందించి సొమ్ముతో ఉడాయిస్తున్నాడు.

మోసం బట్టబయలు ఇలా.. 
కలిదిండి మండలం గుర్వాయిపాలేనికి చెందిన బొల్లా ముత్యాలమ్మ గత నెల 6న కలిదిండి ఎస్‌బీఐ బ్యాంకుకు డ్వాక్రా రుణ వాయిదా చెల్లించేందుకు వెళ్లింది. అప్పటికే కొన్ని రోజులుగా డ్వాక్రా మహిళలకు తాను బ్యాంకు సిబ్బంది, వెలుగు కార్యాలయానికి చెందిన వ్యక్తిగా మీరావలి నమ్మిస్తూ వచ్చాడు. దీంతో ఓచర్‌ రాసి నగదు కౌంటర్‌లో చెల్లిస్తానని చెప్పగా ముత్యాలమ్మ నమ్మింది. అతడికి రూ.61 వేలు ఇవ్వగా.. కౌంటర్‌ వద్దకు వెళ్లి నగదు చెల్లించకుండా అప్పటికే తన జేబులో సిద్ధం చేసుకున్న చెల్లింపు రశీదును ఆమెకు ఇచ్చి మోసం చేశాడు.

ఆ రశీదు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తాజాగా తిరగి వాయిదా చెల్లించేందుకు వెళ్లగా, అసలు బండారం బయట పడింది. ఆమె కలిదిండి పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకులో సీసీ పుటేజీని పరిశీలించి నాగూల్‌ మీరావలిని గుర్తించారు. అతడికి ఆచూకీ తెలిసిన వారు పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. బ్యాంకుల వద్ద ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కలిదిండి ఎస్సై పవన్‌కుమార్‌ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement