బాబు గ్రాఫిక్స్‌ పెట్టుబడులు.. జగన్‌ రియల్‌ పెట్టుబడులు 

YS Jaganmohan Reddys government made record investments - Sakshi

కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు మాటల బురిడీ 

బాబు హయాంలో కంటే సీఎం జగన్‌ హయాంలో రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన వాస్తవ పెట్టుబడులు 

2014–18 మధ్య రాష్ట్రంలోకి వచ్చి న పెట్టుబడులు రూ.32,803 కోట్లే 

2019 నుంచి 2023 జూన్‌ వరకు వచ్చి న పెట్టుబడులు రూ.1,00,103 కోట్లు 

రెండేళ్లు కరోనా ఉన్నా భారీ పెట్టుబడులను ఆకర్షించిన జగన్‌ సర్కారు.. 2022లో రూ.45,217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానం

చంద్రబాబు పాలన  
ఓ కంప్యూటర్‌.. అందులో పెద్ద పెద్ద కంపెనీల పేర్లు, లోగోలు.. వాటి గ్రాఫిక్స్‌.. ఓ వంద అంకెలు, నలభై గీతలు.. వంద అబద్ధాలు. అన్నీ భూతద్దంలో చూపిస్తారు. వినడానికి, గ్రాఫిక్స్‌ చూడటానికి అబ్బో అనిపిస్తాయి. వాస్తవంగా వచ్చే పెట్టుబడులు సున్నా. పెట్టుబడులన్నీ కాగితాలకు, కంప్యూటర్లకే పరిమితం. 

సీఎం వైఎస్‌ జగన్‌ పాలన 
చంద్రబాబు గ్రాఫిక్స్‌ లాంటి టక్కుటమారాలేమీ ఉండవు. అంతా వాస్తవికత. వచ్చే పెట్టుబడులే కాగితాల్లో కనిపిస్తాయి. అవే ప్రజలకు చేరతాయి. వాస్తవంగా నూరు శాతం పెట్టుబడులతో రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. కాగితాల్లో ఉన్న పెట్టుబడులే పరిశ్రమలుగా రూపుదిద్దుకొని ప్రజల ముందు నిలుస్తాయి.  – సాక్షి, అమరావతి  

అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పెట్టుబడు­లు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే గడిచిన నాలుగున్నర ఏళ్లలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ఈ విషయం వెల్లడించింది స్వయానా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ.

ఆ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఫర్‌ ఇండ్రస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం..  2014–18 మధ్య కాలంలో (చంద్రబాబు పాలన) రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చి న పెట్టుబడులతో పోలిస్తే 2019 నుంచి 2023 జూన్‌ వరకు (వైఎస్‌ జగన్‌ పాలన) వచ్చి న పెట్టుబడులు 226.9 శాతం అధికంగా వచ్చాయి. 2014–18 క్యాలండర్‌ ఇయ­ర్‌ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాస్తవ రూపంలోకి వచ్చి ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు మాత్రమే.

ప్రస్తుత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో రూ.1,00,103 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ప్రతి ఏటా హాడావుడి చేసి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని చెప్పిన వార్తల్లో వాస్తవం ఏమాత్రం లేదని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో వివిధ పెట్టుబడుల సదస్సుల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి నట్లు ఉత్తుత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న విషయం సుస్పష్టమైంది. 

తరలి వస్తున్న దిగ్గజ సంస్థలు 
చంద్రబాబుకు భిన్నంగా వైఎస్‌ జగన్‌ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు చేయకుండా పరిశ్రమలకు అన్ని విధాలా చేయూతనిస్తున్నారు. సీఎం జగన్‌ సహకారం అందించడంతో రిలయన్స్, అదానీ, టాటా, బిర్లా, హెచ్‌యూఎల్, బ్లూస్టార్, డైకిన్, ఇన్ఫోసిస్‌ వంటి అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి.

కానీ విశాఖ పెట్టుబడుల సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేశాయి. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఇదంతా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ కృషికి నిదర్శనమని పారిశ్రామికవర్గాలు వెల్లడించాయి.  

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top