సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) విశాఖలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.
అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.
పర్యటన షెడ్యూల్
ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కలుస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించిన వైఎస్ జగన్, ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.


