ఆరోగ్యం ఎలా ఉందన్నా..? | YS Jagan Met Visakha Steel Plant Victims | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం ఎలా ఉందన్నా..?

Jun 11 2026 5:31 AM | Updated on Jun 11 2026 7:29 AM

YS Jagan Met Visakha Steel Plant Victims

సత్యానంద్‌ను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్, అర్జునను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో గాయ­పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులు, కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రతి­పక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామ­ర్శించారు. వారిని ఓదార్చి భరోసా కల్పించారు. క్షతగా­త్రు­లకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూ­స్తామని ధైర్యం చెప్పారు. ఒక్కొక్క­రినీ పేరు పేరునా పలుకరిస్తూ.. ఆరోగ్యం ఎలా ఉంది? వైద్య సేవలు ఎలా అందుతున్నా­యి? ప్రమాదం ఎలా జరిగింది? అని ఆరా తీశారు. అధైర్యపడొ­ద్దని.. అండగా ఉంటామని హామీనిచ్చారు. విశాఖ రామ్‌నగర్‌లోని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద­గంట్యాడ సీతానగరానికి చెందిన గోకివాడ సూరిబాబు (కాంట్రాక్ట్‌ వర్కర్‌), అగనంపూడి లక్కరాజు­పాలే­­నికి చెందిన కార్మికుడు పి.శ్రీనివాస­రావు­(చార్జి­మెన్‌)ను పరామర్శించారు. కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రిలో రావూరి మల్లికార్జున­రావు (సీని­యర్‌ టెక్నీషియన్‌), గుడివాడ అర్జున అప్పారావు(చార్జిమెన్‌), ఒడిశాకు చెందిన సత్యా­నంద్‌ బాలువాను వైఎస్‌ జగన్‌ బుధవారం పరా­మ­ర్శించారు. ఒక్కొక్కరి బెడ్‌ వద్దకు వెళ్లి.. బాధితుల చేతులు పట్టుకుని ‘నేను­న్నాను... అధైర్యపడకండి‘ అంటూ కొండంత ధైర్యాన్ని, భరోసాను ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ను చూడగానే ఆస్పత్రి వద్ద కార్మికుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కు ఆసుపత్రి పాలు కావడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధను ఆసాంతం విన్న జగన్‌ ప్రతి ఒక్కరినీ ఓదారుస్తూ అండగా ఉంటానని మాట ఇచ్చారు.

సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి వద్ద..
వైఎస్‌ జగన్‌: గోకివాడ సూరిబాబు అన్నకు వైద్యం సరిగ్గా అందుతుందా..?
కార్మికుడు గోకివాడ సూరిబాబు బావమరిది శ్రీనివాస్‌: ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. చాలా భయంగా ఉందన్నా మాకు.. దేవుడి మీదే భారం వేశాం. 
వైఎస్‌ జగన్‌: అధైర్య పడొద్దు శ్రీనివాస్‌ అన్నా.. దేవుడి దయతో సూరిబాబు అన్నకు నయం అవుతుంది. 
శ్రీనివాస్‌: మీ రాకతో మాకు కాసింత  ధైర్యం కలిగింది అన్నా..!
వైఎస్‌ జగన్‌: ప్రభుత్వం ఆర్థిక సాయం ఇచ్చేలా ఒత్తిడి తెస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోతే మన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందిస్తా. 
(యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఏ రకంగా అందజేస్తామన్నది సమగ్రంగా వారికి తెలియజేయాలని అక్కడే ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అనిల్‌ కుమార్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు)

కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి వద్ద...
వైఎస్‌ జగన్‌: ‘‘ఆరోగ్యం ఎలా ఉంది..? వైద్యం బాగా అందుతుందా..? ప్రమాదం జరిగినప్పటి నుంచి వైద్యసేవలు సక్రమంగా అందుతున్నా­యా అన్నా..?’’
రావూరి మల్లికార్జునరావు: అందుతున్నాయి అన్నా..!
వైఎస్‌ జగన్‌: స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం ఎలా జరిగింది..? 
మల్లికార్జునరావు: నేను స్టీల్‌ ప్లాంట్‌ ఎస్సెమ్మెస్‌ విభాగంలో సీనియర్‌ టెక్నీషియన్‌గా పనిచేసు­న్నా. ఎస్సెమ్మెస్‌ విభాగంలో లాడెల్‌ నుంచి ఉక్కు లిక్విడ్‌ బ్లాస్ట్‌ అయి ఒక్కసారిగా మంటలు  వ్యా­పించాయి. ఆ ఉక్కు ద్రవం పడిన చోటకు నేను కాసింత దూరంలో ఉండడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాను అన్నా..!
వైఎస్‌ జగన్‌: మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా.. ఇవ్వని పక్షంలో మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆర్థిక సహాయం అందిస్తా. ధైర్యంగా ఉండు మల్లికార్జున అన్నా.. నీకేమి భయం లేదు.. నీకు అండగా మీ జగనన్న ఉన్నాడు..! (మల్లికార్జున అన్న పూర్తిగా కోలుకునేంత వరకూ మెరుగైన వైద్యం అందించాలని అక్కడున్న వైద్యులు గోపాల్‌రాజుకు వైఎస్‌ జగన్‌ సూచించారు) 

వైఎస్‌ జగన్‌: ఆరోగ్యం ఎలా ఉంది..? వైద్య సేవలందుతున్నాయా..? 
క్షతగాత్రుడు గుడివాడ అర్జున అప్పారావు: అందుతున్నాయి అన్నా..
వైఎస్‌ జగన్‌: స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం ఎలా జరిగింది..? 
అర్జున: నేను చార్జిమెన్‌గా పనిచేస్తున్నా. ఎస్సె­మ్మెస్‌ విభాగంలో జరిగిన ప్రమాదంతో భయపడ్డాం. లాడెల్‌ నుంచి ఉక్కు లిక్విడ్‌ బ్లాస్ట్‌ అయి ద్రవం కింద పడినప్పుడు దూరంగా ఉండడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నా. అది టీ తాగే సమయం కావడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. లేదంటే  పెరిగేది.
వైఎస్‌ జగన్‌: ధైర్యంగా ఉండు అన్నా..! నీకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది. మీ జగనన్న ఉంటాడు. పూర్తిగా నయం అయ్యేవరకూ ఆసుపత్రిలో వైద్యం అందుతుంది. ఎటువంటి ఆందోళన వద్దు.. మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా.. ఇవ్వని పక్షంలో మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే ఆర్థిక సహాయం అందిస్తా. 

 

Advertisement
 
Advertisement
Advertisement