దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటి? | YS Jagan directly questions Chandrababu on reservations for Dalit Christians | Sakshi
Sakshi News home page

దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటి?

Jul 2 2026 5:26 AM | Updated on Jul 2 2026 5:27 AM

YS Jagan directly questions Chandrababu on reservations for Dalit Christians

సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

పదవుల్లో ఉన్న మీ పార్టీ నాయకులు దళితులను కించపరుస్తుంటే మీరేం చేస్తున్నారు?

మత విద్వేషాలను రెచ్చగొడుతూ.. దుర్భాషలాడుతుంటే అడ్డుకోలేరా?

దళితులు మతం మారినంత మాత్రాన వారి వెనుకబాటుతనం పోదు అందుకే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్‌ కల్పించాలని తీర్మానం చేశాం

జస్టిస్‌ కేజీ బాలకృష్ణ కమిషన్‌ ముందు ఇదే వాదన వినిపించాం 

చేతనైతే మంచి చేయి.. చేయలేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టొద్దు

సాక్షి, అమరావతి: దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల విషయంలో మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కుల విద్వేషాలను, మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. దళితులు మతం మారినంత మాత్రాన వారి వెనుకబాటు తనం, పేదరికం, సామాజిక హోదాలు మారిపోవని స్పష్టం చేశారు. 

బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో కులాలు, మతాలు పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి సృష్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఇందుకోసం చెప్పేందుకు ఈ రెండేళ్లలో శతకోటి ఉదాహరణలు కన్పిస్తున్నాయ­న్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్ట­డానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రతీ మూడు నెలలకోసారి ఏదో మూల జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. 

నివారించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నారు
ఇటీవలి కాలంలో ప్రభుత్వంలో ఉన్న వారు, పద­వుల్లో ఉన్న వారు.. దళితులను, దళిత క్రైస్తవులతో సహా ఇతర కులాలను లక్ష్యంగా చేసుకొని అన్యాయంగా, అవమానకరంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారని వైఎస్‌ జగన్‌ నిలదీశారు. దగ్గరుండి వెనుక నుంచి ప్రోత్సహిస్తుండటం మన కంటికి కన్పిస్తోందన్నారు. ‘రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా మత విద్వేషాలకు అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తున్నాడు.  దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా.. వద్దా.. అనే దానిపై కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌ విచారణ సాగిస్తోంది. 

మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు మారవు. మతానికి, రిజర్వేషన్లకు ముడి పెట్టడం ధర్మం కాదని అసెంబ్లీలో 2023 మార్చి 24న తీర్మానం చేశాం. రిజర్వేషన్లతో మతాలకు సంబంధం లేదు. మతం మారడం వల్ల వాళ్ల్ల ఆర్థిక హోదాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు జరగవు. రిజర్వేషన్లకు, మతాలకు మధ్య ముడి పెట్టడం సరికాదని తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణన్‌ కమిషన్‌కు వైఎస్సార్‌ సీపీ బృందం వెళ్లి వినతిపత్రం ఇచ్చి గట్టిగా ఇదే వాదన విన్పించింది. 

ఈ విషయంలో మీ వైఖరి ఏమిటో చెప్పాలని చంద్రబాబును గట్టిగా అడుగుతున్నా.. చేతనైతే మంచి చేయి.. మంచి చేయకపోతే ఈ మాదిరిగా విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. మీ పార్టీలో ఉన్న వాళ్లు, పదవుల్లో ఉన్న వాళ్లు దళితులను కించపరుస్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు? కట్టడి చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు’ అని చెప్పారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన పారిశుధ్య కార్మికులు
అండగా నిలుస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా
సాక్షి, అమరావతి: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్‌)లో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమను కొత్త కాంట్రాక్టర్‌ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడంతో వారంతా బుధవారం తాడేపల్లి చేరుకుని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తమను విధుల నుంచి తొలగించడం వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. 

కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్‌లో శానిటేషన్‌ పనుల కాంట్రాక్ట్‌ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని కార్మికులు తెలిపారు. దీంతో జీవనోపాధి కోల్పోయి తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలన వైఎస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్య­లను సావధానంగా విన్న వైఎస్‌ జగన్‌ వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వారి ఉద్యోగాల పరిరక్షణ కోసం న్యాయ­పరమైన సహాయాన్ని పార్టీ లీగల్‌ సెల్‌ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ అన్నివిధాలా తోడుగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement