కొడుకు గురించి అడిగితే.. ఫొటోకు దండ వేసుకోమంటారా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan commented on Sai Krishna case | Sakshi
Sakshi News home page

కొడుకు గురించి అడిగితే.. ఫొటోకు దండ వేసుకోమంటారా?: వైఎస్‌ జగన్‌

Jun 18 2026 6:43 PM | Updated on Jun 18 2026 8:57 PM

YS Jagan commented on Sai Krishna case

సాక్షి,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్‌18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడ సాయి తల్లిని, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయి అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడారు. 

ప్రతి ఒక్కరూ ఆలోచించాలి:
‘‘ విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే చంద్రబాబు నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్‌ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీపరిధి. ఇదే పరిధిలోనే ఈ పోలీసు స్టేషన్‌ ఉంది. ఇదే పోలీసు స్టేషన్‌ పరిధిలోనే నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెప్తూ రోదిస్తున్న దృశ్యం. ప్రతీ ఒక్కరినీ ఒకటో ఆలోచన చేయమని అడుగుతున్నా.

చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్‌కు పోవడానికి కూడా భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. ఇదే పోలీసు స్టేషన్‌ కమిషనరేట్, ఏసీపీ కార్యాలయం పరిధిలో ఉన్నాయి. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకువస్తున్నారని చెప్పడానికి నిదర్శనం ఇది.

మే నెలలోనే రెండు ఘటనలు:
మే మాసంలో ఒక ఘటన కాదు. సాయికృష్ణది ఓ ఘటన అయితే క్రాంతికుమార్‌ అనే మరో పిల్లాడిది ఇంకో ఘటన. అది ఆత్మహత్య ఘటన. పలానా సీఐ, పలానా పోలీసు స్టేషన్‌ పరిధి. రోజూ నన్ను కొడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. నా చావుకు కారణం ఆ సీఐ అని మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్ధితి. మే 9న సాయికృష్ణ ఘటన కూడా జరిగింది.

‘నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో’ అన్న పోలీసులు:
ఆరోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’.. అంటూ ఈ తల్లిని హేళనగా మాట్లాడిన పరిస్ధితి. ఆరోజు నుంచి ఈ తల్లి ప్రతీ రోజూ తనకు సమాచారం అందే కొద్దీ, ఆ స్టేషన్‌లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అర్దమై అదే పోలీసు స్టేషన్‌ కు ప్రతీ రోజూ వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధపడుతున్న పరిస్ధితులు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. జరిగిన ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్‌ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్‌ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు.

సాయికృష్ణను చంపినట్లు ఒప్పుకున్నారు:
అప్పుడు కచ్చితంగా నా కొడుకుకు ఏదో జరిగిందని ఆ తల్లికి అర్దమై జూన్‌ 2న హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసింది. నా కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని పిటిషన్‌ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకుని మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐని సస్పెండ్‌ చేశారు. ఆ సీఐని ఎందుకు సస్పెండ్‌ చేశారో చెప్పగలరా? చంపేశాడనే కదా సీఐని సస్పెండ్‌ చేసింది. అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే ఆ సీఐ పరిధిలోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్‌ ను కాపాడుతూ డీజీపీ.. మొత్తం అందరికీ తెలిసి స్టేషన్లో జరిగిన ఒక హత్య మాత్రమే కాదు. పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ, కొడుతూ ఒకరి చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని, వీడియో ద్వారా తన మెసేజ్‌ ను తెలియజేసిన పరిస్ధితి. నేను ఒకటే చెప్తున్నాం. సస్పెన్షన్‌ అంటే ఏంటి?. టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే హత్య చేస్తే, గోళ్లు పీకి చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్‌ చేశారు. ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.

తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా?:
ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే.. ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్‌ ను, డీజీపీని మర్డర్‌ కేసు పెట్టి ఛార్జ్‌ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్‌ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్పందీగా, కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది. ఆ పిల్లాడి వయసెంత 23 ఏళ్లు. అంటే వీళ్లంతా చిన్న పిల్లలే. తెలిసో తెలియకో కొద్దో గొప్పో తప్పు చేసి ఉండొచ్చు. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్‌ చేయమని సమన్‌ చేసింది. వీళ్లు చేయాల్సింది ఏంటి ? ఆ పిల్లాడిని కోర్టుకు సబ్‌మిట్‌ చేయడం. అది పోలీసులు చేయాల్సిన పని. ఆ పిల్లాడు తప్పు చేసాడా, లేదా అన్నది ఆర్గుమెంట్‌ చేసి నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుంది.

సీబీఐ దర్యాప్తు జరపాల్సిందే:
కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదు. వీళ్లే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమైన పరిస్ధితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇలాంటి పోలీసు అధికారులు వీళ్లకు వత్తాసు పలుకుతుంటే, సీఐ దగ్గరి నుంచి, ఏసీపీ దగ్గరి నుంచి, కమిషనర్‌ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తురుపు చర్యలు చేపట్టి కేవలం సస్పెన్షన్‌ తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్‌ స్టాప్‌ పడుతుంది. ఫుల్‌ స్టాప్‌ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్‌ అయ్యారనేది బయటికి రావాలి. ఆ పోలీసుల మీదు ఎందుకు మీరు యాక్షన్‌ తీసుకోవడం డిలే జరిగింది, సస్పెన్షన్‌ మాత్రమే చేసి టెంపరరీగా ఉద్యోగం నుంచి పక్కన బెట్టారంటే ఇది ఒక్కరితో కాదు, సిస్టమేటికా జరుగుతున్న ఈ క్రై మ్‌ లో సీఐ ఒక్కడే కాదు ఏసీపీ, సీపీ, డీజీపీ ఇన్వాల్స్‌ అయి ఉన్నారు. అందుకే సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్‌ చేస్తున్నాం. డిమాండ్‌ చేయడమే కాకుండా న్యాయపోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సార్సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.

అసలు ఏ చర్యా లేదు.కేవలం కంటితుడుపు మాత్రమే:
ఇదంతా ఎంత కంటితుడుపు చర్య అంటే, అసలు యాక్షనే తీసుకోలేదు. మే 9వ తారీఖు నుంచి రెండు మర్డర్‌ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్‌ లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారంటే, ఏ విధంగా వీళ్లంతా క్రై మ్‌ ను బయటికి రాకుండా చేస్తున్నారో, ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి, సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఇన్‌ ఛార్జ్‌ లు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి. దీని మీద ఎంక్వైరీ అట. కమిషనర్‌ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్స్‌ అయి ఈ క్రై మ్‌ చేయించారని కనిపిస్తా ఉన్న పరిస్ధితుల్లో ఓ ఎస్పీ స్థాయి అధికారిని వీళ్లు ఎంక్వైరీ చేయడానికి బాధ్యత అప్పగించారంట. అంటే ఏ రకంగా వీళ్లు లా అండ్‌ ఆర్డర్‌ తో చెలగాటం ఆడుతున్నారు, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం.

అందుకే సీబీఐ దర్యాప్తు కావాలి:
నేను ఒకటే చెప్తున్నాను. ఇది కచ్చితంగా సీబీఐ ఎంక్వైరీకి పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సీఐ దగ్గరి నుంచి ఏసీపీ దగ్గరి నుంచి, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరో తెలిసి ఎలా కాపాడుతున్నారు, ఎందుకు రోటీన్‌ పద్ధతిలో ఇలాంటి లాకప్‌ డెత్‌ లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ రావాల్సిందే ’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement