సాక్షి, అనంతపురం: సాధారణంగా భక్తులు కోర్టు కేసులు గెలవాలనో, అప్పులు తీరాలనో, ఉద్యోగాలు రావాలనో లేదా కుటుంబాలు చల్లగా ఉండాలనో కోరుకుంటూ హుండీలలో ఉత్తరాలు వేస్తుంటారు. కానీ, ఓ భక్తుడు ఏకంగా తన అత్తగారి మరణాన్ని కాంక్షిస్తూ కరెన్సీ నోటుపై అభ్యర్థనతో రాసిన వింత లేఖ వెలుగులోకి వచ్చింది.
ఆలయ అధికారులు,స్థానిక భక్తుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు
అయితే ఆ వింత లేఖ రాసిన సదరు మహిళ ఎవరు అనేది తెలియరాలేదు. ఆమె అత్తగారి నుంచి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, వేధింపులు ఏ స్థాయికి చేరితే.. చివరికి ఎవరికీ చెప్పుకోలేక ఇలా నేరుగా భగవంతుడికే తన ఆవేదనను నివేదించుకుందనే కోణంలో సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కాగా, హుండీ లెక్కింపులో దొరికిన ఈ రూ. 20 నోటు తాలూకు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని హాస్యాస్పదంగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం సమాజంలో అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లోపించడానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో భక్తులు తమ వ్యక్తిగత బాధలను, దేవాలయాల లోపాలను హుండీ లేఖల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడం పెరిగిపోతోందని, ఇటీవల కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలోనూ ఇలాంటి వింత లేఖలే బయటపడిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
‘ఆలయంలో భక్తులకు కనీస వసతులు కల్పించే వరకు తాము హుండీలో ఒక్క రూపాయి కూడా వేయం’ అని భక్తులు స్పష్టం చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయి, హుండీని వేదికగా చేసుకుని భక్తులు డిమాండ్లతో కూడిన వినూత్న నిరసన లేఖలు వేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.



