
సాక్షి, విశాఖపట్నం: పెత్తందారులపై పేదల తరఫున పోరాటానికి సిద్ధమంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పూరించిన ఎన్నికల శంఖారావం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది. గుంపులుగా వస్తున్న జెండాలు, పెత్తందారుల అజెండాలపై యుద్ధానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినిపించిన రణన్నినాదంతో భీమిలి నియోజకవర్గం సంగివలస సభా ప్రాంగణం జయహో జగన్ అంటూ ఉప్పెనలా ప్రతిధ్వనించింది.
బంగాళాఖాతానికి ఎనిమిది కిలోమీటర్లలో దూరంలో ఉన్న ఆ ప్రాంతం శనివారం జన సాగరాన్ని తలపించింది. జై జగన్.. వైనాట్ 175 నినాదాలతో జాతీయ రహదారి దద్దరిల్లింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తల చెంతకు వచ్చి వారికి అభివాదం చేస్తూ.. వారితో మమేకమై మనమంతా ఒకటిగా రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామంటూ ఇచ్చిన పిలుపునకు ఉత్తరాంధ్ర ఉవ్వెత్తున ఎగసిపడింది.
కార్యకర్తల్లో ఉప్పొంగిన ఉత్సాహం చూస్తే.. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా.. 2024లో మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఖాయమని శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాబోయే ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన ‘సిద్ధం’ సభ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది.
కౌరవ సైన్యంపై యుద్ధానికి మేము సైతం..
ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా.. అంటూ కార్యకర్తల్ని తనతో పాటు సమర సన్నద్ధం చేశారు. జగనన్న వెంటే.. మా పయనమని.. యుద్ధానికి సిద్ధమంటూ అధినేతతో లక్షల గొంతులు దిక్కులు పిక్కటిల్లేలా నినదించాయి. కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్న జగనన్న రథసారథిగా.. ఆయనతో కలిసి సాగేందుకు కోట్లమంది కార్యకర్తలు ‘సిద్ధం’’గా ఉన్నామంటూ సంగివలస సభ చాటిచెప్పింది. దాదాపు గంటకు పైగా సాగిన అధినేత ప్రసంగం.. వేదికపై ఉన్న నాయకుల్లోనే కాదు.. తరలివచ్చిన లక్షలాది మంది పార్టీ కుటుంబ సభ్యుల్లోనూ ఎన్నికల సమరోత్సాహాన్ని నింపింది.
వైఎస్ జగన్ ప్రసంగం వింటూ మైమరచిపోయిన కార్యకర్తలు.. ఇక తగ్గేదేలే.. మళ్లీ సీఎం కుర్చీపై జగనన్నని కూర్చోబెట్టేదాక శ్రమిస్తామంటూ నినదించారు. చంద్రబాబు అండ్ కోకి ఉన్నట్లుగా మనకు దుష్టచతుష్టయం లేదని.. ప్రతి ఒక్కరి దగ్గరా ఉన్న సెల్‌ఫోనే మన ఆయుధమంటూ జగన్ చెప్పిన వెంటనే పార్టీ కార్యకర్తలంతా సెల్‌ఫోన్ బయటకు తీసి జగన్‌కు చూపించారు.
దుర్మార్గులపై పోరుకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ అధినేత పిడికిలి బిగించగానే.. లక్షలాది మంది పార్టీ శ్రేణులు పిడికిలి బిగిస్తూ మద్దతు పలికారు. పార్టీ శ్రేణులే కాదు.. వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ తాము కూడా సిద్ధమంటూ చేతులు పైకెత్తి నినదించారు.
తరలివచ్చిన ఉత్తరాంధ్ర
పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా ఊహించిన దానికంటే లక్షల్లో కార్యకర్తలు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది.
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి జనాల్ని నట్టేట ముంచిన చంద్రబాబు మార్కు రాజకీయాల్ని ఎండగట్టిన వైఎస్ జగన్.. ఈ 56 నెలల పాలనలో రాష్ట్రంలోని ప్రతి పల్లె, మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. ఇది తమ బాధ్యతంటూ కార్యకర్తలు నినదించగా సభా స్థలి హోరెత్తింది. ఏ గ్రామానికి వెళ్లినా జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని.. ఇది జగనన్న పాలన అని ప్రజలకు చెప్పాలంటూ అధినేత చేసిన ప్రసంగానికి ముగ్ధులైన శ్రేణులు జోష్‌లో మునిగిపోయారు.
ఉదయం నుంచే సభా ప్రాంగణానికి
మధ్యాహ్నం 3 గంటలకు సీఎం ప్రసంగం మొదలవుతుందని తెలిసినా.. ఉదయం 10 గంటల నుంచే సభా స్థలికి పార్టీ శ్రేణులు క్యూ కట్టాయి. రాత్రి 7 గంటల వరకూ ఏ ఒక్కరూ సంగివలస నుంచి బయటకు వెళ్లకుండా ప్రాంగణంలోనే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. సభా ప్రాంగణంపై నుంచే హెలిప్యాడ్ వైపు వెళ్లారు.
ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు జై జగన్ అంటూ నినదించారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి అభివాదం చేయగానే.. సభా స్థలి దద్దరిల్లింది. సభాస్థలికి చేరుకోలేక వందలాది బస్సుల్లో వేల మంది పార్టీ శ్రేణులు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. మరికొందరు బస్సుల్లోనే జగన్ ప్రసంగాన్ని వింటూ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ వేదిక నుంచి నేరుగా కార్యకర్తల మధ్యలోకి వచ్చి అభివాదం చేసేలా నిర్మించిన ర్యాంప్.. శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
దాదాపు 5 నిమిషాల పాటు ప్రతి కార్యకర్తకూ అభివాదం చేస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ.. ర్యాంప్‌పై వైఎస్ జగన్ ముందుకు సాగారు. తమ వద్దకు వచ్చి పలకరించిన అధినేతని చూసిన ప్రతి కార్యకర్త మురిసిపోయాడు. జగనన్నా అంటూ పలకరిస్తూ.. జై జగన్ అని నినదించారు. ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్‌సీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ ప్రత్యేకంగా అవసరం లేదనీ.. ప్రతి లబ్ధిదారుడితో పాటు తామూ స్టార్ క్యాంపెయినర్లుగా మారుతామంటూ అధినేతకు శ్రేణులు హామీ ఇచ్చాయి.
ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు
ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూరించిన ఎన్నికల శంఖారావానికి తరలి వచ్చిన అశేష జనవాహిని చూసి ఇప్పటికే ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుట్టింది. ఇకపై వైఎస్సార్‌సీపీ కుటుంబం గురించి మాట్లాడాలంటే సంగివలస సభ గుర్తుకు తెచ్చుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారేమో. ప్రతి కార్యకర్తకు జగన్ భరోసా ఇచ్చారు. 2024 ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. – కంబాల జోగులు, ఎమ్మెల్యే, పాయకరావుపేట
జగనన్న పవర్ చూపించాం
సంగివలసలో మోగిన ఎన్నికల నగారాతో.. ప్రతిపక్ష పార్టీల ఓటమి ఖరారైపోయింది. రాబోయే ఎన్నికలకు ఉత్తరాంధ్ర నుంచి మేం సిద్ధమంటూ సభతో స్పష్టం చేశాం. జగనన్న పవర్ ఏంటో చూపించాం. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహంతో దూసుకెళ్లేందుకు ఇదో గొప్ప సభ. పార్టీ శ్రేణుల్లోనే కాదు.. నాయకుల్లోనూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల జోష్ నింపారు. ఇదే స్ఫూర్తితో ఈ 70 రోజులూ సైన్యంలా పనిచేస్తాం. – కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త, నెడ్ క్యాప్ చైర్మన్
భీమిలి సభ అద్భుతం
ఇలాంటి సభ ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందో లేదో చెప్పలేం. ఇలాంటి సభ మళ్లీ నిర్వహించాలంటే అది వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన సభ ఇది. కేడర్‌కు మరింత ఉత్తేజాన్నిచ్చింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన దిశా నిర్దేశం నాయకుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపింది. వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఎందుకు ఓటేస్తారన్నదానిపై జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విధానం కార్యకర్తలకు ఒక గైడ్ లాంటిది. దీన్ని అనుసరించి ప్రజల్లోకి మరింత వెళ్తాం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్
ఎన్నికల జోష్ వచ్చేసింది
సభ ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఎన్నికల జోష్ వచ్చేసింది. సిద్ధం.. సిద్ధం.. అంటూ కార్యకర్తలంతా స్పందించారు. జగన్ చేసిన ప్రసంగం కేడర్‌ని ఆలోచింపజేసింది. ఆయన దిశానిర్దేశంతో ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు దోహదపడనుంది. రానున్న ఎన్నికల్లో నూరుశాతం విజయం సాధిస్తాం.– రెడ్డి శాంతి, పాతపట్నం ఎమ్మెల్యే
సంగివలస సభ సూపర్ సక్సెస్
సంగివలసలో సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు రవాణా ఏర్పాట్లు సరిపోక సభకు రాలేకపోయారు. కేవలం క్యాడర్ వస్తేనే ఇంత స్పందన ఉందంటే ఇక ప్రజలందరినీ తీసుకొస్తే ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారని చెప్పడానికి సంగివలస సమావేశం నిదర్శనం. – కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే