హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసు: వైజాగ్‌ చేరుకున్న బాధితులు | vizag CP says cambodia human trafficking victims reached vizag | Sakshi
Sakshi News home page

హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసు: వైజాగ్‌ చేరుకున్న బాధితులు

Jun 6 2024 5:58 PM | Updated on Jun 6 2024 9:04 PM

vizag CP says cambodia human trafficking victims reached vizag

విశాఖపట్నం:  కంబోడియా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ రవి శంకర్‌ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో ఈ కేసు సంబంధించిన విషయాలు తెలిపారు. 

‘‘మొత్తం 68 మంది బాధితులను రక్షించాము. ఇంకా 90 మంది కంబోడియాలో ఉన్నారు. 68 మందిలో 25 మంది వైజాగ్ వాళ్ళూ. దేశ వ్యాప్తంగా 25 మంది ఏజెంట్లు ఉన్నారు. 12 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశాం. ఆరుగురు ఏజెంట్లుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాము. ఈ మొత్తం స్కాంలో సిమ్ సప్లయార్స్‌ ముగ్గురుని గుర్తించాం. 

... ఒక సిమ్ కార్డు భారత్ నుంచి తీసుకొని వెళ్లి ఇస్తే 10 నుంచి 15 వేలు కమిషన్ ఇస్తారు. నకిలీ బ్యాంక్ అకౌంట్స్.. తయారు చేస్తున్న ముఠాపై కూడా నిఘా పెట్టము. ఎమర్జెన్సీ పాస్ పోర్టు కూడా ఇండియా ఎంబసీ అధికారులు జారీ చేస్తున్నారు’’ అని తెలిపారు.

కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్‌’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.

విదేశాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్‌ విజయ్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్‌ల మీదుగా కంబోడియాకు పంపించారు.

అక్కడ మరో గ్యాంగ్‌ బాధితులను రిసీవ్‌ చేసుకొని కంబోడియాలో పాయిపేట్‌ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్‌ వీసా చేయించి ఆ గ్యాంగ్‌ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్‌ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement