‘నువ్వు వస్తావని ఇంటి డోర్ వద్దే చూస్తున్నా.. ఇలా నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’ అంటూ వేరొకరు..
నన్ను వదిలి వెళ్లిపోయావా?
డ్యూటీకి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న భార్యకు అంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నువ్వు ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి.. అక్కడి నుంచి అటుగానే నన్ను వదిలి వెళ్లిపోయావా? స్టీల్‌ప్లాంట్‌లో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇలా అర్థాంతరంగా వదిలి వెళ్లిపోతారని ఏనాడూ అనుకోలేదు. మావి కూలి బతుకులు. ఇప్పుడు మాకు దిక్కెవరు.
– నక్కా జోగమ్మ, మృతుడు రమణ భార్య
‘12 ఏళ్ల క్రితం ఉక్కు ద్రవం పడి కాళ్లు గాయపడ్డాయి.. నేడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను మింగేసింది!’ అని ఒకరు..

అప్పుడు కాలు.. ఇప్పుడు శరీరమే మసైపోయింది..
12 ఏళ్ల కిందట నా భర్త విధి నిర్వహణలో ఉంటుండగానే ఉక్కు ద్రవం పడి కాలు తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను పొట్టనబెట్టుకుంది. ఏంటి భగవంతుడా మాకీ కర్మ? జీవితంలో ఎన్ని కష్టాలు పడినా పిల్లలిద్దరినీ బీటెక్ చదివించారు. ఇప్పుడు అకస్మాత్తుగా నా భర్తను దూరం చేసి మమ్మల్ని ఇలా రోడ్డున పడేశావు.
– గొట్టాపు రాధ, మృతుడు గోట్టాపు త్రినాథ్ భార్య

అన్యోన్య దాంపత్యాన్ని చూసి దేవుడికే కన్ను కుట్టి..
‘పిల్లల్ని బాగా చూసుకో’ అంటూ మధ్యాహ్నం పెట్టిన మెసేజే నా భర్త ఆఖరి మాట అవుతుందనుకోలేదు’ అని మరొకరు..
‘మాది ప్రేమ వివాహం. 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. మాకు ఇద్దరు పిల్లలు ధను‹Ù, లోకేష్ 6, 7 తరగతులు చదువుతున్నారు. సోమవారం విధులకు వెళ్లిన నా భర్త, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫోన్‌కు మెసేజ్ చేశారు. ‘పిల్లలకు ఒంట్లో బాగోలేదు, వారిని కనిపెట్టుకుని ఉండు’ అని చెప్పారు. ఇంతలోనే ఇంతటి ఘోరవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ప్రేమ వివాహం చేసుకుని పిల్లలతో అన్యోన్యంగా ఉన్న తమ కుటుంబాన్ని చూసి భగవంతుడికి కన్ను కుట్టిందనుకుంటా. సాయంత్రం దేవుడి గదిలో దీపం పెడదామనుకుంటే.. ఏకంగా భర్త జీవితమే దీపంలా ఆరిపోతుందని ఊహించలేకపోయాను.
–గొందేశి రాజమ్మ, మృతుడు వెంకటప్పారావు భార్య
ఇలా మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా చేసిన ఆక్రందనలు.. కన్నీటి రోదనలతో కేజీహెచ్ మార్చురీ ప్రాంగణం శోకసంద్రంగా మారిపోయింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సంభవించిన ఘోర ప్రమాదం ఎనిమిది మంది శ్రామికుల ప్రాణాలను బూడిద చేయడమే కాకుండా, వారిని నమ్ముకున్న కుటుంబాల జీవితాల్లో ఎప్పటికీ పూడ్చలేని చీకట్లను నింపింది. బతుకుదెరువు కోసం నిరంతరం స్వేదం చిందించే ఆ కార్మికులపై, సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల మరిగే ఉక్కు ద్రవం మృత్యువులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది శ్రామికులు సజీవ దహనమై బొగ్గు ముద్దల్లా మారిపోయారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మంగళవారం నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియ, ఆపై తమ వారి మృతదేహాలను చూసి బంధువులు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించాయి.


