వైఎస్సార్‌సీపీలోకి వెంకటాపురం 

Venkatapuram village into YSRCP Andhra Pradesh - Sakshi

కుప్పం నియోజకవర్గంలోని ఆ గ్రామం ఒకప్పుడు టీడీపీ కంచుకోట 

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలనకు ఆకర్షితమై టీడీపీని వీడిన 60 కుటుంబాలు 

ఎమ్మెల్సీ భరత్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక 

శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీలోని వెంకటాపురంలో దాదాపు 60 కుటుంబాలు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి. గ్రామంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్‌ సమక్షంలో వీరంతా పార్టీ మారారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పెద్దన్న ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన వీరికి ఎమ్మెల్సీ భరత్‌ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. ప్రజలు, పేదల కోసం ప్రతిక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు.

దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గ్రామంలో ఇప్పటివరకు మూడు కుటుంబాలు మాత్రమే వైఎస్సార్‌సీపీలో ఉండేవి. ఇప్పుడు ఒక్కసారిగా దాదాపు 60 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గ్రామంలో పట్టున్న తమ్మన్నగారి వెంకటస్వామి, కోళ్లఫారం పెద్దన్నగారి జయవేలు, గొర్లెప్పగారి వెంకటస్వామి, గురుస్వామి వెంకటేష్, సుబ్బక్కగారి సుబ్రమణ్యం, గురుస్వామప్పగారి వెంకటేశు, మునివెంకట, రంగస్వామి, ఎ.వి.రమేష్, ఎన్‌.సుబ్బన్న సహా పలు కుటుంబాల పెద్దలు పార్టీలో చేరారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వివక్షకు తావులేకుండా తమకు లబ్ధిచేకూరడం, ఎమ్మెల్సీ భరత్‌ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు తీర్చడంతో తాము పార్టీలో చేరుతున్నామని గ్రామస్తులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసుంధర, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బుల్లెట్‌ దండపాణి, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు చంగప్ప, కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్‌ గోవింద్, ఎంపీటీసీ సభ్యుడు చలం, బెంగళూరు మురుగేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top