సెప్టెంబర్‌ నెలాఖరుకు వెలిగొండ పూర్తి

Velikonda will be completed by the end of September - Sakshi

మూడు జిల్లాలకు పుష్కలంగా జలాలు

నిర్వాసితులకు పరిహారం చెల్లించాకే నల్లమల సాగర్‌కు నీరు

నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు

సొరంగంలో మంత్రులు అంబటి, ఆదిమూలపు సురేష్‌ సాహసయాత్ర

కొల్లంవాగు నుంచి కొత్తూరు వరకు 19 కి.మీ సొరంగంలోనే ప్రయాణం

పెద్దదోర్నాల /శ్రీశైలం టెంపుల్‌: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్‌ నెలాఖరుకి నిర్మాణం పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన మంగళవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి కొల్లంవాగు వద్ద, మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు పుష్కలంగా జలాలు వస్తాయని తెలిపారు.

ఈ జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, లక్షలాది మందికి తాగు నీరు అందుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్టేజ్‌–1 కింద 1.20 లక్షల ఎకరాలకు, స్టేజ్‌–2 కింద 2.55 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వివరించారు. సుంకేశుల నుంచి తీగలేరు కెనాల్‌కు నీరు తరలించడం ద్వారా యర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, రెండో సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మరో కిలోమీటరు మేర పనులు జరగాల్సి ఉందన్నారు.

ఈ పనులన్నీ మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు నష్టపరిహారాన్ని అందించిన తర్వాతే నల్లమల సాగర్‌లో దశల వారీగా నీటిని నింపుతామని చెప్పారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరితగతిన పూర్తి చేస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత త్వరలో నల్లమల సాగర్‌ను నింపి ప్రజలకు నీరందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.

19 కిలోమీటర్లు సొరంగ మార్గంలోప్రయాణించిన మంత్రులు
మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌ వెలిగొండ సొరంగంలో సాహస యాత్ర చేశారు. కొల్లంవాగు నుంచి మండల పరిధిలో వెలి­గొండ ప్రాజెక్టు సొరంగం పనులు జరుగుతున్న కొత్తూరు వరకు దాదాపు 19 కిలోమీటర్లు సొరంగ మార్గంలోనే ప్రయాణించారు. మంగళవారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వా­మి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మం­త్రులు రోప్‌వే ద్వారా పాతాళగంగకు చేరుకున్నారు.

అనంతరం బోట్‌లో కృష్ణా నదిలో ప్రయాణించి కొల్లంవాగుకు చేరుకున్నారు. అక్కడ హెడ్‌ రెగ్యులేటర్, ఇతర  పనులను పరిశీలించారు. అక్కడి నుంచి బొలెరో వాహనాల్లో మొదటి సొర­ం­గం గు­ండా 13 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం 6 కిలోమీటర్లు రెండో సొరంగం గుండా ప్రయాణించి కొత్తూరు చేరుకున్నారు. గాలి కూడా ఉండని ఇరుకు సొరంగ మార్గాల గుండా మంత్రులు ప్రయాణించటం సాహసమేనని పలు­వురు అధికారులు పేర్కొన్నారు. మంత్రుల వెంట మంత్రి సురేష్‌ తనయుడు విశాల్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top