ఎదురుతన్నిన చంద్రబాబు దుష్ప్రచారం

Urlagadda Row: Rayalaseema Basha Parirakshana Samithi Fires On CBN - Sakshi

ఉర్లగడ్డపై ఇంతలా వెటకారమా?

మా యాసను అవమానిస్తారా  

బాబు అండ్‌ కో పై రాయలసీమ వాసుల ఆగ్రహం

తోచీతోచనమ్మ తోడికోడలుపుట్టింటికి వెళ్లిందట.. అలా అయింది చంద్రబాబు పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏమీ విషయం లేక దిగాలుగా ఉన్న చంద్రబాబుకు..  ఆయన మాటల్లో ఉర్లగడ్డ అనే పదం ఉల్లిగడ్డగా ఉచ్చరించారు అంటూ టీడీపీ, చంద్రబాబు, ఐటీడీపీ లో రెండ్రోజులుగా తెగ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలో పెట్టి లబ్ధిపొందాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇదేం పెద్ద మైలేజి తీసుకురాకపోగా తిరిగి ఎదురుతన్నింది.

కొన్ని పదాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పలుకుతారు. అదేం నేరం కాదు.. ఘోరం కాదు.. ఒకే వస్తువును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉచ్ఛరిస్తారు. ఆ అంశాన్ని పట్టుకుని చంద్రబాబు యాగీ చేసేందుకు ప్రయత్నించడం ద్వారా ఒక ప్రాంతం ప్రజానీకాన్ని అవమానించినట్లు అయింది. తనదీ రాయలసీమే అని చెప్పుకునే చంద్రబాబు ఆ ప్రాంత యాసభాషలను వెక్కిరించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన చంద్రబాబుకు అలుగడ్డను ఉర్లగడ్డ అంటారన్నది తెలీదా.. లేకపోతే అది తప్పా.. ఎందుకని అలా విమర్శిస్తున్నారు అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించాలి అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా లోపాలు ఉంటే చూడాలి కానీ రాయలసీమ భాషను అడ్డం పెట్టుకుని మొత్తం ప్రాంతాన్ని చిన్నబుచ్చడం ఏమిటని అంటున్నారు. 

క్షమాపణ చెప్పాలి
చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ చెప్పుకోవడానికే రాయలసీవాసులు కానీ ఎన్నడూ ఇక్కడ నివసించింది లేదు. పండగపూట చుట్టపు చూపుగా సొంత ఊరికి వచ్చి వెళ్లేవారికి రాయలసీమ యాస, భాష ఎలా తెలుస్తాయి అని అంటున్నారు.  జగనన్న నిఖార్సైన రాయలసీమ బిడ్డ. ఈ ప్రాంతం వ్యక్తిగా ఎవరైనా పెద్ద వారు కనిపిస్తే ఏన్నా బాగుండావా అని.. చిన్నోళ్లయితే ఏమబ్బా బాగుండావా అంటూ ఆప్యాయంగా మా సీమ యాసలో మాట్లాడతారు. మరి రాయలసీమ వాసులని చెప్పుకునే చంద్రబాబుకు, లోకేష్‌కు రాయలసీమ యాస, భాష గురించి తెలుసా? అంటూ రాయలసీమ భాషాపరిరక్షణ సమితి ప్రశ్నిస్తోంది.

తమ భాషను విమర్శించినందుకు చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో గతం ఎన్నికల్లో వచ్చిన మూడు సీట్లు కూడా రానివ్వమని, మొత్తానికి సున్నా చుట్టి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరిస్తూ సమితి పేరిట వచ్చిన కరపత్రాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆ ప్రాంత భాషాభిమానులు ఇప్పుడు చంద్రబాబుమీద ధ్వజమెత్తుతున్నారు. రెండెకరాలతో ఇప్పుడు వేలకోట్లకు అధిపతిగామారి  సీమ యాసను వెక్కిరించే స్థాయికి చేరిన చంద్రబాబును నేలకు దించుతామని వారు అల్టిమేటం ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top