సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజుకు తోడైన ముగ్గురు కిరాతకులు వీళ్లే! | Updates on the SIT Investigation and Judicial Proceedings: Gade Sai Krishna Case | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజుకు తోడైన ముగ్గురు కిరాతకులు వీళ్లే!

Jun 26 2026 12:20 PM | Updated on Jun 26 2026 12:59 PM

Updates on the SIT Investigation and Judicial Proceedings: Gade Sai Krishna Case

సాక్షి,విజయవాడ: కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణలో సిట్ అధికారులు కీలక విషయాలను వెలికితీశారు. సీఐ నాగరాజు అరెస్ట్ అనంతరం ఈ కేసులో మరికొందరి పాత్రపై సిట్ జరిపిన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, అలాగే ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా సహకరించినట్లు సిట్ నివేదిక స్పష్టం చేస్తోంది.

సీఐ నాగరాజు అరెస్ట్ అయిన వెంటనే హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానిలతో పాటు సీఐ సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఐ అసిస్టెంట్‌గా హెడ్ కానిస్టేబుల్ అశోక్ వ్యవహరించగా.. మరో హెడ్ కానిస్టేబుల్ నాని సీఐ పేరు చెప్పుకుని ప్రైవేట్ సెటిల్‌మెంట్లు, దందాలు నడపడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది.

గతంలో గన్నవరం, పటమట పోలీస్ స్టేషన్లలో పని చేసినప్పుడు నానిపై అనేక ఆరోపణలు రావడంతో అతడిని వీఆర్‌కు పంపారు. అయితే, ఇటీవలే మళ్లీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. సీఐ సన్నిహితుడైన సురేష్.. సాయికృష్ణ మృతదేహాన్ని లొకేషన్ నుండి మాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

గత నెల 29వ తేదీన సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను ఒక సెటిల్‌మెంట్ విషయమై సురేష్ పిలిచాడు. ఆ తర్వాత సురేష్, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలు కలిసి ఒక నల్లటి రంగు వాహనంలో వడ్డేశ్వరంలోని నవరంగ్ ఇంటికి వెళ్లారు. నవరంగ్ ఇంటికి వెళ్లి వారు చేసిన హడావుడి, బెదిరింపుల అంశాన్ని సాయికృష్ణ మేనమామ నవరంగ్ స్వయంగా సిట్ అధికారుల విచారణలో వెల్లడించారు.

సాయికృష్ణ మృతదేహాన్ని దాచడంలో లేదా వేరే చోటికి తరలించడంలో ఈ ముగ్గురూ సీఐ నాగరాజుతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, ప్రైవేట్ వ్యక్తి సురేష్‌ల కోసం సిట్ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement