‘స్థానిక’ ఉత్పత్తుల ప్రోత్సాహానికే యూనిటీ మాల్‌

Unity Mall is for the promotion of local products - Sakshi

విశాఖ బీచ్‌రోడ్డులో స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

రూ.172 కోట్లతో నిర్మాణం

సాక్షి, విశాఖపట్నం: ఒక్కొక్క రాష్ట్రంలోని ప్రత్యేకమైన హస్తకళల ఉత్పత్తులు, వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ప్రొడక్ట్, భౌగోళిక గుర్తింపు (జీఐ ఇండెక్స్‌) పొందిన ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించడం, విక్ర­యిం­చడమే లక్ష్యంగా యూనిటీ మాల్‌ నిర్మిస్తు­న్నట్లు ఇన్వెస్ట్‌ ఇండియా ప్రతినిధులు సోనియా దుహానా, ఆకాంక్ష తెలిపారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌–2023 సందర్భంగా ‘ది యూనిటీ మాల్‌’ అనే ప్రాజెక్టును కేంద్రం ప్రవేశపెట్టి ఆయా రాష్ట్రాల్లోని రాజధాని లేదా ఆర్థిక రాజధాని, లేదా ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతంలో యూనిటీమాల్‌ ఏర్పాటుకు స్థలాన్ని సిద్ధం చేయాలని సూచించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మాల్‌ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బీచ్‌రోడ్డులోని రామానాయుడు స్టుడియో సమీపంలో ఉన్న 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలం యూనిటీ మాల్‌ నిర్మాణానికి అను­వుగా ఉందా లేదా అనే అంశాల్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇన్వెస్ట్‌ ఇండియా ప్రతినిధులు విశాఖలో శుక్రవారం పర్యటించారు. స్థలం సరిహద్దులు, ఇతర వివరాలను ఖాదీబోర్డు సీఈవో విజయరాఘవ నాయక్, హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ ఏడీ డా.పద్మ, డీఐసీ జీఎం గణపతి, ఏపీహెచ్‌డీసీ ఈడీ విశ్వ, డీహెచ్‌టీవో మురళీ కృష్ణ వారికి వివరించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.172 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తుందనీ.. 50 నెలల పాటు రుణంపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా అందించనుందని ఇన్వెస్ట్‌ ఇండియా ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే డీపీఆర్‌ సిద్ధమైన వెంటనే టెండర్లు ఖరారు చేసి వీలైనంత త్వరగా యూనిటీ మాల్‌ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు  వెల్లడించారు. మధురవాడ తహసీల్దార్‌ రమణయ్య పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top