పొగాకు రైతుకు దగా | Tobacco Farmers Fires on Chandrababu Govt: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుకు దగా

Jul 29 2025 3:03 AM | Updated on Jul 29 2025 3:03 AM

Tobacco Farmers Fires on Chandrababu Govt: Andhra pradesh

‘నల్లబర్లీ’ రకం చివరి ఆకు వరకు సేకరిస్తామని సర్కారు దొంగ హామీలు

టన్ను రూ.12 వేలు చొప్పున కొంటామని కూడా భరోసా

రైతుల వద్ద పేరుకుపోయిన 53 వేల టన్నులు సేకరిస్తామని హామీ

అయితే, ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్లేనని మెలిక.. నాణ్యత పేరిట సర్కారు పొగ

పైగా.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారి నుంచే కొనుగోళ్లు

ఇలా ఇప్పటివరకు 6,455 టన్నులు మాత్రమే సేకరణ

కొనుగోళ్లు ప్రారంభించి 45 రోజులైనా పైసా విదల్చని ప్రభుత్వం

బాబు మాయ మాటలకు మోసపోయామంటున్న రైతులు

నల్లబర్లీ పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం నయవంచనకు గురిచేస్తోంది. మిర్చి రైతుల మాదిరిగానే వీరిని కూడా ముంచేస్తోంది. రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు టన్ను రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించిన టీడీపీ కూటమి సర్కారు.. కొనుగోలు దగ్గరకొచ్చేసరికి సవాలక్ష ఆంక్షలతో వారిని దగా చేస్తోంది. ఓ వైపు కొనుగోలు చేయకుండా కంపెనీలు ముఖం చాటేస్తుంటే.. మరోవైపు ఆంక్షల పేరిట ప్రభుత్వం మోసం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారి నుంచి మాత్రమే కొనుగోళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. మిగిలిన సామాన్య రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. పైగా.. కొనుగోలు చేసిన పొగాకు సేకరించి 45 రోజులు అవుతున్నా ఎవరికీ ఒక్క పైసా కూడా చెల్లించలేదని వారు గగ్గోలు పెడుతున్నారు.  – సాక్షి, అమరావతి

జగన్‌ పర్యటనతో కదిలిన ప్రభుత్వం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీలు ఇచ్చిన భరోసాతో రైతులు గత రబీ సీజన్‌లో పెద్దఎత్తున నల్లబర్లీ పొగాకు (హెచ్‌డీ బర్లీ) సాగుచేశారు. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. వరుస వైపరీత్యాల ఫలితంగా ఎకరాకు 10–12 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. మొత్తం మీద గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో 20 వేల మంది రైతులు 91వేల ఎకరాల్లో నల్లబర్లి సాగుచేయగా, ఎకరాకు 879 కేజీల చొప్పున 80 వేల టన్నుల దిగుబడులొచ్చాయి.

అయితే, ఐడీ నంబర్లు ఇచ్చి దగ్గరుండి సాగుచేయించిన కంపెనీలు పంట చేతికొచ్చే సమయానికి డిమాండ్‌ లేదంటూ ముఖం చాటేశాయి. ఆదుకోవాలి్సన ప్రభుత్వం పత్తాలేకుండా పోవడంతో అప్పుల పాలైన రైతులు పెద్దఎత్తున బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలిలో పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వెళ్లిన తర్వాత ప్రభుత్వంలో కదిలిక వచ్చింది. కంపెనీలు 27 వేల టన్నులు సేకరించాయి. మిగిలిన నిల్వల్లో 33 వేల టన్నులను కంపెనీల ద్వారా.. 20 వేల టన్నులను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ఆంక్షలతో చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం..
మరోవైపు.. రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 20 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయబోమని ప్లేటు ఫిరాయించింది. సాధారణంగా ఇలాంటి  సందర్భాల్లో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తారు. గరిష్టంగా ఐదెకరాలు లేదా 10 ఎకరాల పరిధిలోని రైతుల వద్ద పంట నిల్వలు కొనుగోలు చేయాలి.

ఈ లెక్కన.. ఐదెకరాల్లోపు చిన్న రైతు దగ్గర సైతం దాదాపు 60 టన్నులకు తక్కువ కాకుండా పొగాకు నిల్వలుంటాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం పెట్టిన నిబంధనల పుణ్యమాని 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగిలిన 40 క్వింటాళ్లను అమ్ముకునేందుకు ఆ రైతు ఎక్కడకు వెళ్లాలి? అలాగని ఆ మిగిలిన నిల్వలను కంపెనీలతో కొనుగోలు చేయిస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో.. కళ్లాల్లోనూ, రైతుల ఇళ్ల వద్ద పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. దీనికితోడు.. ఇటీవల కురుస్తున్న వర్షాలవల్ల వాటిని భద్రపర్చుకునేందుకు రైతులకు అదనంగా ఎకరాకు రూ.4వేలకు పైగా ఖర్చవుతోంది.

పైసా విదల్చని ప్రభుత్వం..
ఇక నాణ్యతతో సంబంధంలేకుండా టన్ను రూ.12వేలకు కొంటామని ముందుగా చెప్పిన ప్రభుత్వం.. చివరికి హై క్వాలిటీ (హెచ్‌డీఆర్‌) పొగాకును క్వింటా రూ.10 వేలు–12 వేలు ఇస్తామని, మీడియం క్వాలిటీ (హెడ్‌డీఎం) పొగాకును రూ.7 వేలు–9 వేలు, లో క్వాలిటీ (హెచ్‌డీఎక్స్‌) పొగాకు రూ.4 వేలు–6 వేలకు మించి కొనుగోలు చేయలేమని మెలికపెట్టింది. అయితే, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 6,455 టన్నులు మాత్రమే సేకరించగా, కంపెనీలు మరో 5,550 టన్నులు సేకరించాయి. ఇంకా రైతుల వద్ద 41వేల టన్నుల పొగాకు నిల్వలున్నాయి.

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన పొగాకులో 832.80 టన్నులు హై క్వాలిటీ (12.9 శాతం), 2,944.24 టన్నులు మీడియం క్వాలిటీ (45.6 శాతం), 2,678.53 టన్నుల లో క్వాలిటీ (41.5 శాతం) చొప్పున గ్రేడింగ్‌ నమోదుచేశారు. పైగా.. దాదాపు 20 వేల మంది రైతులుండగా, ఇప్పటివరకు కేవలం 2,767 మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేశారు. వీరిలో ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా జమచేసిన పాపాన పోలేదు. పొగాకు కొనుగోలుకు జాతీయ çసహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి రూ.209 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి (పీఎస్‌ఎఫ్‌) నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని మార్క్‌ఫెడ్‌ అభ్యర్థనను సైతం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలకు మోసపోయామని రైతులు వాపోతున్నారు.

రూ.4 లక్షలు నష్టపోయాను..
సొంతంగా మూడెకరాలు, మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. గతేడాది మంచిధర లభించడంతో ఈ ఏడాది పొగాకు సాగుచేశా. మా గ్రామంలో 80 మంది రైతులు నమోదుచేసుకున్నారు. 20 మంది దగ్గర కూడా కొనలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచే  కొనుగోలు చేస్తున్నారు. నా దగ్గర 40 క్వింటాళ్ల పొగాకు ఉంది. పేరుకు 20 క్వింటాళ్లంటున్నారు. అదీ కూడా కొనుగోలు చేయలేదు. కొన్న వాళ్లకు పైసా కూడా జమచేయలేదు. ఈ ఏడాది రూ.4 లక్షల నష్టపోయాను. –అవినాష్,  వంకాయలపాడు, బాపట్ల జిల్లా

అనుకూలురైన వారి నుంచే కొనుగోళ్లు..
ఈ ఏడాది కౌలు­కు 18 ఎకరాలు తీసుకుని నల్లబర్లి పొగాకు వేశా. ఇప్పటివరకు ఎకరాకు లక్షన్నర ఖర్చయ్యింది. పేరుకు 20 చెక్‌లు (20 క్వింటాళ్లు) మించి తీసుకోమంటున్నారు. నా దగ్గర ఇంకా 100 క్వింటాళ్లకు పైగా ఉంది. నమోదు చేశారే తప్ప కొనుగోలు చేయడంలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. కనీసం ఒక్కో రైతు నుంచి 40 చెక్‌లకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి.     –గెద్దల రవి,ఇంకొల్లు, బాపట్ల జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement