ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు | Three additional judges to AP High Court | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు

Jul 4 2026 3:42 AM | Updated on Jul 4 2026 3:45 AM

Three additional judges to AP High Court

సునీత , గిరిధర్ , పురుషోత్తం కుమార్‌

గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం నియామకం

రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు

ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం

సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌.. వచ్చే వారం ప్రమాణ స్వీకారం

32కు చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ :  న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ముగ్గురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్‌ శ్రీనివాసన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అదనపు న్యాయమూర్తులుగా వీరు రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులవుతారు. ఈ ముగ్గురి చేత వచ్చే వారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణం చేయించనున్నారు. న్యాయమూర్తులుగా ఈ ముగ్గురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. 

అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే 4న సమావేశమై, వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. వీరిలో గంధం సునీత ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు. ఆలపాటి గిరిధర్‌ విశాఖపట్నం సేల్స్‌ ట్యాక్స్‌ అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. పురుషోత్తం కుమార్‌ ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టుకు మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 32కు చేరింది.  

గంధం సునీత  
గంధం సునీత 1977 జూలై 14న కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో గంధం వీరయ్య, శివనాగేంద్రమ్మ దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెదకళ్లేపల్లిలోని ఎస్‌డీఎన్‌ఎస్‌డీఎస్‌ పాఠశాలలో 10వ తరగతి, మచిలీపట్నం లేడీయాంప్తిల్‌ కాలేజీలో ఇంటర్, విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. మాంటిస్సోరి కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి టాపర్‌గా బంగారు పతకం సాధించారు. 1999 జూలై 1న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 

2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 2010లో సివిల్‌ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం జిల్లా జడ్జిగా పలు చోట్ల పని చేశారు. 2019–23 మధ్య హైకోర్టు రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2023 నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  

ఆలపాటి గిరిధర్‌  
ప్రకాశం జిల్లా కొండెపి మండలం గోగినేనివారిపాలెంలో ఆలపాటి గిరిధర్‌ జన్మించారు. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశాంత్ర ప్రధానోపాధ్యాయుడు. గిరిధర్‌ ఒంగోలు ఇందిరా ప్రయదర్శిని న్యాయ కళాశాలలో లా డిగ్రీ పొందారు. 1998 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఒంగోలు జిల్లా కోర్టుతో పాటు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 

ఆ తర్వాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో న్యాయాధికారిగా పనిచేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా కూడా వ్యవహరించారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రధాన జిల్లా జడ్జీలుగా పని చేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ వ్యాట్‌ అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

చింతలపూడి పురుషోత్తం కుమార్‌  
విశాఖపట్నంలో చింతలపూడి రాంబాబు, రామరత్నం దంపతులకు పురుషోత్తం కుమార్‌ జన్మించారు. రాంబాబు విశ్రాంత జిల్లా జడ్జి. ఈ కుటుంబంలోని వారు మూడు తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్నారు. పురుషోత్తం కుమార్‌ ఆంధ్ర యూనివర్సిటీలో మెరైన్‌ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2002 నవంబర్‌ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 

ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టులో సైతం వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రిజి్రస్టార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement