మరో వైఎస్సార్‌సీపీ నేత టార్గెట్‌? | TDP Leaders Target On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

మరో వైఎస్సార్‌సీపీ నేత టార్గెట్‌?

Aug 6 2024 1:43 PM | Updated on Aug 6 2024 3:19 PM

TDP Leaders Target On YSRCP Leaders

 కమ్మపల్లి వైఎస్సార్‌సీపీ నేత సుబ్రమణ్యం రెడ్డి కోసం టీడీపీ వెతుకులాట 

సుబ్రమణ్యంరెడ్డి కుమార్తె దుస్తుల దుకాణంలోకి చొరబడి అద్దాలు ధ్వంసం 

 వైఎస్సార్‌సీపీ నేత కోసం టీడీపీ నేతలు రోజంతా వెతుకులాట 

 పుంగనూరులో మంత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీ మూకల వీరంగం 

 రక్షణ కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం 

తిరుపతి, సాక్షి: మరో వైఎస్సార్‌సీపీ నాయకుడిని లేపడానికి టీడీపీ నేతలు కుట్ర చేశారా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుంగనూరులో సోమవారం రవాణశాఖ మంత్రి పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కమ్మపల్లిలో సుమారు 150 కుటుంబాలు ఉన్నాయి. అందులో 13 కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి చెందిన వారు. మిగిలిన వారంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు. కమ్మపల్లిలో సంఘమిత్ర మమత ఏడాది క్రితం పొదుపు సంఘాలకు చెందిన రూ.5 లక్షల నగదును స్వాహా చేశారు. 

ఈ విషయం గత ఏడాది నవంబర్‌ 21న వెలుగులోకి రావడంతో స్థానికులు నిలదీశారు. డిసెంబర్‌ 9న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఉన్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీకి చెందిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడులకు తెగబడిన వారిపై కేసులు నమోదు చేశారు. కట్‌ చేస్తే.. సాధారణ ఎన్నికల్లో బాధిత కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీకి ఓటువేశారు. 

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాది క్రితం జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని, గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 13 కుటుంబాలను లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. జూన్‌ 5వ తేదీ నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన 13 కుటుంబాలపై దాడులకు తెగబడ్డారు. నివాసాల్లోకి దూరి చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా విచక్షణా రహితంగా చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోకి వచ్చి అలా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను చిత్రహింసలకు గురిచేశారు.

 టీడీపీ మూకల దాడులకు భయపడి సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం అదే రోజు రాత్రి ఊరు విడిచి అడవిలోకి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు బిక్కు బిక్కుమంటూ అడవిలోనే గడిపింది. అతికష్టమ్మీద పుంగనూరులోని కుమార్తె జయంతి నివాసానికి చేరుకున్నారు. వీరిని తిరిగి రప్పించాలంటూ మిగిలిన 12 కుటుంబాలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వీరి చిత్రహింసలకు భరించలేక మరో మహిళ ఊరు వదిలి వెళ్లిపోయింది. ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియదు.

ఆస్తులు, పంట ఉత్పత్తులు ధ్వంసం
సుబ్రమణ్యంరెడ్డి కుటుంబాన్ని ఊర్లోకి పిలిపించే వరకు 12 కుటుంబాల వారికి చెందిన పంట దిగుబడులు, పాలు విక్రయించడానికి వీల్లేకుండా చేశారు. సుబ్రమణ్యంరెడ్డి ఇటుక బట్టీలను ధ్వంసం చేశారు. సుమారు 20 ఎకరాల్లోని టమాటా పంటను విక్రయించకుండా అడ్డుకోవడంతో పూర్తిగా పాడైపోయింది. కమ్మపల్లిలో బంధీలుగా ఉన్న వైఎస్సార్‌సీపీ కుటుంబాలను టీడీపీ నేతలు మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమించమని అడిగి కాళ్లు పట్టుకునే వరకు వారిని విడిచి పెట్టలేదు. ఈ విషయాలు ఎవరికీ తెలియకుండా, ఫొటోలు, వీడియోలు తీయకుండా టీడీపీ మూకలు వారి వద్ద ఉన్న ఫోన్లు లాక్కున్నారు. వైఎస్సార్‌సీపీ కుటుంబాల జీవనం సాఫీగా సాగాలంటే సుబ్రమణ్యంరెడ్డి కుటుంబాన్ని ఊర్లోకి పిలిపించాలని ఒత్తిడి చేస్తున్నారు. మరో వైపు సుబ్రమణ్యంరెడ్డి కుటుంబాన్ని రప్పించేందుకు అప్పులు చేసి పారిపోయారని దుష్ప్రచారం చేశారు.

మంత్రి పర్యటనలో స్కెచ్‌
వైఎస్సార్‌సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి పుంగనూరులోని కుమార్తె నివాసంలో తలదాచుకున్న విషయం టీడీపీ నేతలు తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి కుమార్తె జయంతికి గ్రామంలోని బంధువుల నుంచి, స్నేహితుల నుంచి ఫోన్లు చేయించి బూతులు తిట్టేవారు. ఊర్లోకి రాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సుబ్రమణ్యంరెడ్డి ఊర్లోకి రాకపోవడంతో పుంగనూరుకే వెళ్లి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకు సోమవారం పుంగనూరులో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటనను వాడుకునేందుకు ప్రయత్నించారు. మంత్రి పర్యటన కోసం అంటూ కమ్మపల్లి నుంచి టీడీపీకి చెందిన కొందరు ప్రత్యేక వాహనాల్లో పుంగనూరుకు చేరుకున్నారు. సుబ్రమణ్యంరెడ్డి కుమార్తె నిర్వహిస్తున్న దుస్తుల దుకాణంలోకి చొరబడ్డారు. షాపులో ఉన్న టైలర్‌ను సుబ్రమణ్యంరెడ్డి, కుమార్తె జయంతి గురించి ఆరా తీశారు. దుకాణంలో రేపటి నుంచి పనిచేయవద్దని హెచ్చరించారు. లోపల ఉన్న కుట్టుమిషన్లు, అద్దాలు ధ్వంసం చేశారు. వెళ్తూ వెళ్తూ గదిని అద్దెకు ఇచ్చిన యజమానిని హెచ్చరించారు. దుకాణం వెంటనే ఖాళీ చేయించాలని హుకుం జారీ చేశారు. సుబ్రమణ్యం రెడ్డి ఆచూకీ కోసం సోమవారం రాత్రి వరకు గాలించారు. టీడీపీ నేతల స్కెచ్‌ మీడియాకు లీక్‌ అవడంతో పుంగనూరు నుంచి జారుకున్నట్లు సమాచారం.

మా ప్రాణాలకు ముప్పు ఉంది
కమ్మపల్లికి చెందిన రమేష్‌నాయుడు, చిట్టిబాబునాయుడు, త్రిలోక్‌నాయుడు, మధుసూదన్‌నాయుడు తదితరుల నుంచి మా ప్రాణాలకు హాని ఉంది. మా అమ్మా నాన్నలతోపాటు నా కోసం వెతుకుతున్నారు. మా పంటలను ధ్వంసం చేశారు. ఇటుకలను ఎత్తుకెళ్లారు. పశువులకు మేతకూడా వేయకుండా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని, మా వాళ్లను చిత్రహింసలు పెడుతున్నారు. గ్రామంలో మా వాళ్లకు ఏం జరిగిందో, ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. – జయంతి, సుబ్రమణ్యంరెడ్డి కుమార్తె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement