అమరావతిలో దేవుడి భూములకు ఎసరు.. పల్నాటి వీరులను వదల్లేదు? | TDP Leaders Occupy Palnati Related Amaravati Lands | Sakshi
Sakshi News home page

అమరావతిలో దేవుడి భూములకు ఎసరు.. పల్నాటి వీరులను వదల్లేదు?

Jun 14 2026 12:16 PM | Updated on Jun 14 2026 1:00 PM

TDP Leaders Occupy Palnati Related Amaravati Lands

సాక్షి, గుంటూరు: అమరావతి ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన భూముల కేటాయింపుపై మరోసారి వివాదం చెలరేగింది. తుళ్లూరు మండలంలోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన భూములను దేవాలయానికి తిరిగి కేటాయించాల్సి ఉండగా, వాటిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకు కట్టబెట్టారు.

వివరాల ప్రకారం.. తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 161లో సుమారు 6 ఎకరాల 44 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమరావతి భూసమీకరణ (Land Pooling)లో భాగంగా తీసుకున్న అధికారులు, అనంతరం ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను దేవాలయానికి కాకుండా ఇతరులకు కేటాయించారు. దేవాలయ భూములకు సంబంధించి ఫామ్-8 రికార్డుల్లో "నో ట్రాన్స్‌ఫర్" అనే స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ, దానిని పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయి. ఈ భూములకు బదులుగా రావాల్సిన 21 రిటర్నబుల్ ప్లాట్లు దేవాలయానికి అందకుండా, టీడీపీకి చెందిన కొందరు నేతల పేర్లపై నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ప్లాట్ల విలువ రూ.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పల్నాటి వీరుల దేవాలయ నిర్వహణ, నిత్యకైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం దాదాపు ఆరు దశాబ్దాల క్రితం దాతలు ఈ భూములను దానం చేసినట్లు సమాచారం. అలాంటి భూములకు సంబంధించిన హక్కులను విస్మరించి కేటాయింపులు చేయడం దేవాదాయ ఆస్తుల రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల వెలగపూడి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు పల్నాటి వీరుల దేవాలయ భూముల అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement