మహిళపై దాడి చేస్తున్న టీడీపీ నేత కుటుంబం
ఓ మహిళపై అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం
గుంటూరు నగరంలో దారుణం
తాగునీటి మోటార్ తొలగించాలని వివాదం
ఈ క్రమంలో మహిళను బెదిరించిన టీడీపీ నేత
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు
విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసి
విచక్షణా రహితంగా దాడి.. అందరూ చూస్తుండగానే
నడిరోడ్డుపై దుస్తులన్నీ లాగేసి కొట్టిన వైనం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఓ మహిళను వివస్త్రను చేసి చితక బాదారు. ఏకంగా 10 నిమిషాల పాటు అలానే నడిరోడ్డుపై ఉంచి మూత్రం పోసేలా దాడి చేశారు. ఈ అనాగరిక ఘటన గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో బుధవారం చోటు చేసుకోగా, శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లో
కృష్ణబాబు కాలనీలో ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమె ఇంటికి తాగు నీటి పైప్‌లైన్‌కు సుమారు 15 సంవత్సరాల క్రితం మోటారు ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేశారు.
ఈ క్రమంలో ఆమె ఇంటి పైప్‌లైన్‌కు ఉన్న మోటారును తొలగించాలని ఆ ప్రాంత టీడీపీ నేత మల్లెల వెంకట రమణ మూర్తి ఇటీవల నగర పాలక సంస్థలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె.. మల్లెల మూర్తిని కలిసి.. సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ పైప్‌లైన్‌కు మోటారు వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. ఈ సందర్భంగా దానిని తొలగించాల్సిందేనని మూర్తి హుకుం జారీ చేశాడు. దీంతో బుధవారం సాయంత్రం వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మూర్తి బెదిరించడంతో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె.. నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
అయితే పోలీసులు బందోబస్తుకు వెళ్తున్నామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మూర్తి, ఆయనకు చెల్లి వరుస అయ్యే ట్రాన్స్ జెండర్ మాధవితో పాటు కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఆమెపై దాడికి దిగారు. ఆమెను కింద పడేసి కాళ్లతో కొట్టుకుంటూ అడ్డు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. అక్కడితో వదలకుండా నడి రోడ్డుపై ఆమెను వివస్త్రను చేసి మరి తీవ్రంగా దాడి చేశారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ నడిరోడ్డుపై 10 నిమిషాల పాటు కూర్చోబెట్టి.. మూత్రం పోసుకునేలా దాడి చేశారు. స్థానికులు గుమికూడడంతో వారు వెళ్లిపోయారు. అనంతరం స్థానికుల సహాయంతో బాధితురాలు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు మూర్తితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

పంచాయితీ కోసం రంగంలోకి టీడీపీ పెద్దలు
బాధితురాలితో రాజీ చేసేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారం వైఎస్సార్‌సీపీ నేతల దృష్టికి వెళ్లకముందే సద్దుమణిగేలా చూడాలని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి కొందరు నేతలను పురమాయించినట్లు సమాచారం. బాధితులకు నచ్చజెప్పి.. లేదా బెదిరించి రాజీ కుదిర్చేలా చూడటానికి కొందరు నేతలు మధ్యవర్తిత్వం నెరపడం నగరంలో చర్చనీయాంశమైంది. నిందితులపై చర్యలు తీసుకోకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తున్నారు. హోం మంత్రి, మహిళా కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


