సీడబ్ల్యూసీ సభ్యుడు యోగేశ్ పైథంకర్ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కమిటీ
డ్యామ్ పూడిక సమస్య నుంచి ఆర్డీఎస్‌కు నీటి సరఫరా వరకూ అధ్యయనం
ఏడు అంశాలపై ఆర్నెల్లలోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి జల్ శక్తి శాఖ ఆదేశం
సాక్షి, అమరావతి: తుంగభద్ర పరీవాహక ప్రాంతం(బేసిన్)లోని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర అధ్యయనం కోసం కేంద్రం ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలిసారిగా ఈనెల 27న ఢిల్లీలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కార్యాలయంలో సమావేశం కానుంది. సీడబ్ల్యూసీ సభ్యుడు (వాటర్ ప్లానింగ్, ప్రాజెక్ట్స్) యోగేష్ పైథంకర్ అధ్యక్షతన ఏపీ ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి బీఎస్ శివశంకర్, తెలంగాణ ఈఎన్‌సీ ఓవీ రమేష్ బాబు, సీడబ్ల్యూసీ సీఈలు అభిషేక్ బెనర్జీ, సంజయ్ గంగ్వార్, శరబ్‌జీత్‌సింగ్ భక్షీ, ఓంప్రకాష్ గుప్తా సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి తుంగభద్ర బోర్డు కార్యదర్శి ఆస్మా ఖాతూన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
గత నెల 25న తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్లు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తోపాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్ హాజరై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్ర జలాల వినియోగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ప్రకటించారు.
ఆ మేరకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈనెల 11న కేంద్ర జల్ శక్తి శాఖ జాయింట్ కమిషనర్ సంజయ్‌కుమార్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడు అంశాలపై అధ్యయనం చేసి ఆర్నెల్లలోగా నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని నిర్దేశించారు.
తుంగభద్ర హైపవర్ కమిటీ అధ్యయనం చేసే అంశాలివీ..
⇒ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కింద చారిత్రక వినియోగం, నీటి అవసరాలు, నిర్వహణలో ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం.
⇒ తుంగభద్ర డ్యాంలో ఏ మేరకు పూడిక చేరింది..? దాని వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఎంత తగ్గింది..? సాగు, తాగునీటి అవసరాలు, జలవిద్యుదుత్పత్తిపై ఏ మేరకు ప్రభావం పడుతోంది..? డ్యామ్ భద్రత, వరద నియంత్రణ చర్యలపై సూచనలు.
⇒ తుంగభద్ర డ్యామ్‌లో పూడిక తీతకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలించి లాభదాయక మార్గాలను సూచించడం. ఇకపై రిజర్వాయర్‌లో పూడిక చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు.
⇒ఆర్డీఎస్‌కు నీటి లభ్యత భరోసా కల్పించేందుకు తుంగభద్ర డ్యామ్ దిగువన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరంతోపాటు ట్రిబ్యునల్ అవార్డులు, ఒప్పందాలు, న్యాయపరమైన ఆమోదంపై అధ్యయనం.
⇒ తుంగభద్ర డ్యామ్‌లో పూడిక తీత వల్ల ప్రయోజనం ఉంటుందా? సమాంతరంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించడం వల్ల మేలు జరుగుతుందా? లాంటి అంశాలపై సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలన. అంతర్రాష్ట్ర అంశాలు, సామాజిక, పర్యావరణ, న్యాయపరమైన చిక్కులపై అధ్యయనం.
⇒ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పులకు లోబడి రాష్ట్రాలకు వాటా మేరకు నీరు అందే అవకాశంపై పరిశీలన.
⇒అవసరమైతే సబ్ కమిటీలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకునేందుకు హైపర్ కమిటీకి అధికారాలు.


