
అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత విజయశేఖర్ రెడ్డి అరాచకం
ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించి అధికారులపై దౌర్జన్యం
ఎంపీడీవోను దుర్భాషలాడుతూ బెదిరింపులు
ఆఫీసులకు రావద్దని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు హుకుం
నందలూరు: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. చివరకు అధికారులు, మండల ఉపాధ్యక్షుడిని కూడా ఆఫీసులకు రావద్దంటూ హుకుం జారీ చేసే స్థితికి చేరాయి. ప్రభుత్వం తమదని, ఆఫీసులకు రావద్దంటూ అధికారులను, ఇతర నేతలను అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత బెదిరించే స్థాయికి దిగజారారు.
ఇదీ జరిగింది..
నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి మండల పరిషత్ అధికారులతో పలు ప్రజా సమస్యలపై చర్చించడానికి అధికారులతో సమావేశమయ్యారు. ఎంపీపీతోపాటు మండల పరిషత్ ఉపా«ద్యక్షుడు నాయనపల్లి అనుదీప్ పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదే సమయంలో టీడీపీ నాయకుడు విజయశేఖర్ రెడ్డి తన అనుచరులతో ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించారు. వస్తూనే ఎంపీడీవోను దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. ప్రభుత్వం తమదని, ఇక్కడెవరూ సమావేశాలు పెట్టడానికి వీల్లేదని, కార్యాలయంలో ఎవరూ ఉండొద్దంటూ హుకుం జారీ చేశారు. అక్కడే ఉన్న మండల ఉపాధ్యక్షుడు నాయనపల్లి అనుదీప్ అడ్డుకోబోగా, నీవసలు ఈ కార్యాలయంలోకి రావద్దంటూ దౌర్జన్యం చేశారు.
ఇలా చెప్పడానికి నీవెవరని, నీకేమి సంబంధం అని విజయశేఖర్ రెడ్డిని అనుదీప్ గట్టిగా నిలదీశారు. దీంతో విజయశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున రగడ సృష్టించారు. అధికారులు, వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో టీడీపీ నేత, అనుచరులు బయటకు వచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులపట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బెదిరిస్తే బెదిరేది లేదు : అనుదీప్
విజయశేఖర్ రెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గుచేటుగా ఉందని మండల ఉపాధ్యక్షుడు నాయనపల్లి అనుదీప్ అన్నారు. మండల పరిషత్‌కు ఏమాత్రం సంబంధంలేని టీడీపీ నేత అధికారులను దుర్భాషలాడడం టీడీపీ అరాచకాలకు అద్ధం పడుతోందన్నారు. తమను కూడా బెదిరించారని, అయినా బెదిరేది లేదని స్పష్టంచేశారు.