ప్రజల మనోభావాలతో ఆడుకుంటారా
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
మదనపల్లె : జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల మనోభావాలతో చెలగాటమాడితే జనం మిమ్మల్ని గంగలో కలుపుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆదివారం ఎస్టీయూ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమరనాథరెడ్డిలను రాజకీయంగా ఎదుర్కోలేక జిల్లాను మూడు ముక్కలుగా చేసి మూడు జిల్లాల్లో కలిపి చేస్తున్న ప్రయత్నాలను చేతకానితనంగా పేర్కొన్నారు. రాజకీయంగా వారిని చేతనైతే ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. రాజకీయ కక్షలకు ప్రజల మధ్య చంద్రబాబు విభేదాలు సష్టిస్తున్నారని విమర్శించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు జిల్లాలూ మారుస్తామంటే కుదరదన్నారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ ను చూసుకొని తనకు ఎదురులేదని చంద్రబాబు వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలోకి రాయచోటిని కలపవద్దని..రాజంపేట, కోడూరుతో జిల్లా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అమరావతి రైతులకు కౌలు ఇవ్వలేరా
అప్పులతో రాజధాని నిర్మిస్తున్న చంద్రబాబు సంపద సృష్టి ప్రగల్భాలు ఏమయ్యాయని ఈశ్వరయ్య ప్రశ్నించారు. వేలకోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు, అలాంటిది రాజధానికి భూములు ఇచ్చిన కౌలు రైతులకు,స్థలాల కోసం రూ.300 కోట్లు ఇవ్వలేరా అని నిలదీశారు. మదనపల్లెలో ఆదివారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ ఎప్పుడో అన్నారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తున్నారన్నారు. రాజధానిలో వర్షపు నీళ్లు తోడేందుకు రూ.450 కోట్లు ఖర్చుపెట్టినట్టు ప్రభుత్వమే చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. వైద్య కళాశాలలో ప్రైవేట్ కు అప్పగించి ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూలగొట్టడం ఖాయమన్నారు.


