రాయచోటిలో బంద్ ప్రశాంతం
● స్వచ్ఛందంగా దుకాణాలు మూత
● రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంచాలని ఉధృతమైన ఆందోళనలు
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచో టిని తొలగించి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలను దిక్కుకొకటి చొప్పున కలుపుతున్నారన్న వార్తల ప్రచారంపై రాయచోటిలో ఆందోళనలు ఉధృతమయ్యా యి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై రాయచోటిలో ఒక్కసారిగా నిరసనలు, ఆందోళన లు మిన్నంటాయి. రెండురోజులుగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన రాయచోటి బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి బంద్‌కు సంపూర్ణ మద్దత్తును ప్రకటించారు.ఉద్యోగులు, ప్రజా సంఘాలు పలు రాజకీయ పార్టీల నేతలు బంద్‌కు మద్దతుగా నిలిచారు. బంద్ ప్రభావంతో ఉదయం పది గంటల వరకు బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ రాయచోటిలోని శివాలయం చెక్ పోస్టు నుంచి చిత్తూరు జాతీయ రహదారి మీదుగా నేతాజీ సర్కిల్ వరకు సాగింది. అన్ని వర్గాల ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆర్టీసీ బస్సులు తిరిగాయి. జిల్లా విభజన చేయాలన్న ఆలోచన కూటమి నేతల కుట్రలో భాగమేనని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాలతోపాటు కూటమి పార్టీలోని నేతలు సైతం ప్రకటనల ద్వారా బహిర్గతం అవుతున్నారు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆత్మహత్యలకై నా సిద్ధమని యువకులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంపై ఆదోళనలను ఉధృతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా సాధన కమిటీ నాయకులు చెబుతున్నారు.
పోలీసు బందోబస్తు
జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని రద్దు చేసి పక్క జిల్లాల్లోకి మార్పు చేస్తున్నారన్న వదంతులతో నెలకొన్న ఆందోళనలను అదుపు చేయడానికి పోలీసులు భారీ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ చలపతిల శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.


