వెలవెలబోతున్న పట్టుగూళ్ల మార్కెట్
మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టుగూళ్ల మార్కెట్ వెలవెలబోతోంది. రాయలసీమలోనే రెండో అతి పెద్ద మార్కెట్. రీలర్లు, పట్టురైతులతో నిత్యం కళకళలాడేది. ప్రస్తుతం చలి ఎక్కువ కావడంతో పాటు మంచు కురుస్తుండటంతో మార్కెట్‌కు పట్టుగూళ్లు రావడం లేదు. దీంతో మార్కెట్ బోసిపోతోంది.
మల్లయ్యకొండకు
ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు తిరుగుతాయని తెలిపారు.
వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి సీతారామలక్ష్మణులను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చంటిపిల్ల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, టీటీడీ ఆలయ సివిల్ విభాగం ఏఈ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి వివరించారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
రాయచోటి : ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 29వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరగుతుందని తెలిపారు.
గంగమ్మకు బోనాలు
లక్కిరెడ్డిపల్లి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది.అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు.ఆలయ పూజారులు చెల్లు వంశీయులు వీరికి దర్శనాన్ని కల్పించారు. గంగమ్మా..కాపాడామ్మ అని భక్తులు వేడుకున్నారు.కొందరు భక్తులు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు డయల్ యువర్
ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
మదనపల్లె రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 29వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ శివశంకర్ లోతేటి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబర్ 8977716661కు కాల్‌చేసి సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వెలవెలబోతున్న పట్టుగూళ్ల మార్కెట్


