అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తే చరిత్రహీనులవుతారు
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ విడదీయవద్దని , రద్దు చేయకూడదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, భావోద్వేగాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే వారెవరైనా చరిత్ర హీనులవుతారన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను మొదట విభజించి, ఇప్పుడు పూర్తిగా రద్దు చేయాలనే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమైన ఆలోచనగా ఆయన అభివర్ణించారు. 17 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి ఏ చిన్నపాటి మేలు చేయలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు సాధించుకున్న జిల్లాకే మంగళం పాడాలని చూడటం అన్యాయమని అన్నారు. 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను యథాతధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయచోటి ప్రాంతానికి అభివృద్ధి జరిగిందంటే దివంగతం సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమేనని స్పష్టం చేశారు. కరోనా వంటి పరిస్థితుల్లోనూ జిల్లా కేంద్రం ఏర్పడిన అనతి కాలంలోనే రాయచోటి పట్టణం గణనీయంగా అభివృద్ధి చెందిందని, మూడో గ్రేడ్ మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనతేనని గుర్తుచేశారు. రాయచోటిలో మంచి జరుగుతున్న దశలో రాజకీయ కక్షతో జిల్లా కేంద్రాన్ని లేకుండా చేయాలను కోవడం, జరిగిన మంచిని విచ్చిన్నం చేస్తుండటం ప్రజలను ఆవేదనకు గురిచేస్తోందన్నారు.బ్రిటీషర్ల పాలన నుంచి కూడా 1800లో ఏర్పడిన జల్లాలు ఎక్కడా రద్దు కాలేదని, అన్నమయ్య జిల్లాకు సంబంధించి చంద్ర బాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధకు గురి చే స్తోందన్నారు. జిల్లాల పునర్విభజనపై ఆదివారమే నిర్ణయం తీసుకోనున్న నేపఽథ్యంంలో మరోసారి ప్రశ్నిస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్ రెడ్డి


